
రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో భయపడే పరిస్థితి వచ్చింది. మార్కెట్‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కూరగాయలు కొనాలంటే జేబుకు చిల్లు పడే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా టమాట అంటేనే జనాలు వణికి పోతున్నారు. కిలో టమాట ధర ఏకంగా రూ. 200 దాటేసి రూ. 300 వైపు దూసుకుపోతోంది. దీంతో ప్రజలు టమాట జోలికి పోకుండా ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల కిలో టమాట ధర రూ. 200 దాటేసి ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉంటే ఉల్లి కూడా టమాట బాటలోనే వెళ్లే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఉల్లి ధరలు తక్కువగా ఉన్నాయని సంతోషించే లోపే ఓ పిడుగులాంటి వార్తల ప్రజలను భయపెడుతోంది. ఉల్లి ధరలు కూడా చుక్కలు చూపించడానికి సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. వచ్చే నెలలో ఉల్లి ధరలు భారీగా పెరగనున్నాయని సమాచారం. ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ నాటికి ఉల్లి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ అంచనా ప్రకారం వచ్చే నెలలో కిలో ఉల్లి ధర ఏకంగా 60 నుంచి రూ 70కి చేరు అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఉత్పత్తి, డిమాండ్ మధ్య ఉన్న అసమతౌల్యం కారణంగా ఉల్లి ధర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది…
ఆగస్టు నెలాఖరు నాటికి ఉల్లి ధరలు 150 శాతం పెరుగుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ. 30 వరకు ఉంది. ఈ లెక్కన చూసుకుంటే ఉల్లి ధర నెల రోజుల్లో డబుల్ అవ్వడం పక్కా అని తెలుస్తోంది. ఇక 2020 ఏడాది కంటే దిగువనే ఉల్లి ధరలు కొనసాగుతాయని తెలిపింది. అలాగే ఉల్లి నిల్వ కాలం 2 నెలలు తగ్గాయని క్రిసిల్ తెలిపింది.. ఆగస్టు చివరి నాటికి ఇది మరింత తగ్గే అవకాశం ఉందని వివరించారు. సెప్టెంబర్ నాటికి సరఫరాలు తగ్గి, ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు క్రిసిల్ పేర్కొంది. అయితే అక్టోబర్ నుంచి ఖరీఫ్ పంట వస్తుంది కాబట్టి, దిగుబడులు పెరిగితే ఉల్లి ధరలు మళ్లీ తగ్గుతాయని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆగస్ట్, సెప్టెంబర్ వర్షపాతంపై కూడా ఉల్లి ధరలు ఆధారపడి ఉంటాయని క్రిసిల్ వివరించింది. ఇప్పటికే నిత్యవసర ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతోన్న ప్రజలపై ఉల్లి ధరలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..