సమాజంలో మానవ విలువలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఆస్తి కోసం కట్టుకున్న వారిని, రక్తం పంచుకుని పుట్టిన వాళ్లనూ కడతేరుస్తున్నారు. తాజాగా జార్ఖండ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. భూమి కోసం రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కుంతీ గ్రామంలో రెండు కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరి పొలాలు పక్క పక్కనే ఉండటంతో సరిహద్దు గొడవలు మొదలయ్యాయి. దీనిని మనసులో పెట్టుకున్న ఓ యువకుడు.. తమ తల్లిదండ్రులతో గొడవ పడుతున్న వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. తన స్నేహితులతో కలిసి అపహరించాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. తల నరికి వేరు చేశాడు. అంతే కాకుండా మొండేన్ని, తలను వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు.
కిడ్నాప్ అయిన వ్యక్తి ఇంటి వద్ద కనిపించకపోవడం, ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారి కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. సమీప బంధువులు, చుట్టుపక్కల వారిని అడిగారు. అయితే.. అతన్ని తన మేనల్లుడు తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన మృతుడి తండ్రి తన కుమారుడి ఆచూకీ కనిపెట్టాలంటూ ముర్హు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తుండగా అసలు విషయాలు తెలిశాయి.
డిసెంబర్ 1 న కుటుంబసభ్యులు పొలానికి వెళ్లిన సమయంలో కాను అనే వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అతనికి మాయ మాటలు చెప్పి అపహరించాడు. ఈ క్రమంలోనే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన నిందితుడితో పాటు అతని భార్య, మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొండెం, తలను స్వాధీనం చేసుకుని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా.. ఈ ఘటనతో స్థానికంగా భయానక వాతావరణం ఏర్పడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..