AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMJAY పథకం కింద 68 లక్షల క్యాన్సర్‌ చికిత్సలు.. రూ.15 లక్షల ఆర్ధిక సాయం: కేంద్రం వెల్లడి

ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) కింద 68 లక్షల క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్స్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మంగళవారం తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి జేపీ నడ్డా వివరించారు. అందులో 76 శాతం గ్రామీణ ప్రాంతాల వారికి చికిత్స చేసినట్లు ఆయన వెల్లడించారు..

PMJAY పథకం కింద 68 లక్షల క్యాన్సర్‌ చికిత్సలు.. రూ.15 లక్షల ఆర్ధిక సాయం: కేంద్రం వెల్లడి
Union health minister J P Nadda
Srilakshmi C
|

Updated on: Mar 19, 2025 | 1:44 PM

Share

న్యూఢిల్లీ, మార్చి 19: ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద 68 లక్షలకు పైగా క్యాన్సర్ పేషెంట్లకు రూ.13 వేల కోట్ల విలువైన చికిత్స అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మంగళవారం తెలిపారు. వీటిలో రూ.985 కోట్లకు పైగా విలువైన 4.5 లక్షలకుపైగా క్యాన్సర్‌ చికిత్సలు టార్గట్‌ థెరపీల ద్వారా అందించామన్నారు. అందులో 76 శాతం గ్రామీణ ప్రాంతాల వారికి చికిత్స చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రయోజనాలన్నీ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) కింద లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి జేపీ నడ్డా వివరించారు.

ఈ పథకం కింద రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్‌లతో సహా అనేక రకాల క్యాన్సర్‌లకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 200పైగా ప్యాకేజీలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా ఇందులో 500పైగా మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, పాలియేటివ్ మెడిసిన్ విధానాలు ఉన్నాయన్నారు. వీటిలో CA బ్రెస్ట్ కీమోథెరపీ, మెటాస్టాటిక్ మెలనోమా, క్రానిక్ మైలోయిడ్ లుకేమియా, బర్కిట్స్ లింఫోమా, CA లంగ్ వంటి టార్గెటెడ్ క్యాన్సర్‌ చికిత్సలకు 37 ప్యాకేజీలు ఉన్నాయని మంత్రి తెలిపారు.

దారిద్య్రరేఖకు దిగువన ఉన్న క్యాన్సర్‌ పేషెంట్లకు ఆరోగ్య మంత్రి క్యాన్సర్ పేషెంట్ ఫండ్ (HMCPF) కింద రూ.15 లక్షల వరకు ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా జనరిక్‌ మెడిసిన్‌ (మందులను) దాదాపు 217 AMRIT ఫార్మసీల ద్వారా 50-80 శాతం డిస్కౌంట్‌ ధరకే అందిస్తున్నట్లు వివరించారు. మొత్తం 289 ఆంకాలజీ మందులను మార్కెట్ ధరలో సగం ధరకే అందిస్తున్నామన్నారు. ఇక 2025-26లో జిల్లా ఆసుపత్రులలో 200 డేకేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు జరిగినట్లు నడ్డా చెప్పారు. అధునాతన క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు దేశంలోని వివిధ ప్రాంతాలలో 19 రాష్ట్ర క్యాన్సర్ సంస్థలు, 20 తృతీయ క్యాన్సర్ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.