గుజరాత్, మార్చి 12: అరేబియా సముద్రంలో ఎన్‌సీబీ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్, గుజరాత్ ఏటీఎస్, ఎన్‌సీబీ సంయుక్తంగా నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో రూ.480 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ జాయింట్ ఆపరేషన్‌లో ఆరుగురు పాకిస్థానీ పౌరులను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో వీరిని అరెస్టు చేశారు. మార్చి 11-12 తేదీల్లో ఈ జాయింట్ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఆరుగురు వ్యక్తులు అక్రమంగా 80 కిలోల డ్రగ్స్‌ను తరలిస్తున్న పాకిస్తానీ బోటును ఇండియన్ కోస్టల్ గార్డ్ దళం పట్టుకున్నట్లు ఎన్‌సీబీ ఓ ప్రకటనలో తెలిపింది.
భారత కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సంయుక్తంగా అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలోని అరేబియా సముద్రంలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ మేరకు ఎన్‌సీబీ సూపరింటెండెంట్ సునీల్ జోషి మీడియాకు తెలిపారు. మార్చి 11-12 మధ్యన రాత్రి సమయంలో ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. పోర్‌బందర్ నుంచి అరేబియా సముద్రంలోకి 350 కి.మీ దూరంలో పడవను పట్టుకున్నారు. ఐసీజీ నౌకలు, ఏటీఎస్ గుజరాత్, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సమన్వయంతో పడవను అడ్డగించినట్లు తెలిపారు. గత మూడేళ్లలో ICG, ATS గుజరాత్, NCB సంయుక్తంగా దాదాపు రూ. 3,135 కోట్ల విలువైన 517 కిలోల మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. తాజాగా పట్టుబడిన డ్రగ్స్ కేసు పదవది కావడం విశేషం. గత 30 రోజుల్లో గుజరాత్ తీరంలో పట్టుబడిన రెండో అతిపెద్ద యాంటీ నార్కోటిక్ ఆపరేషన్ ఇది. ఇండియాలోనే తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి.
గత నెల (ఫిబ్రవరి) 28న గుజరాత్ తీరంలో అనుమానిత పాకిస్థానీ పౌరులు ప్రయాణిస్తున్న పడవ నుంచి 3,300 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ అంతర్జాతీయ మార్కెట్ విలువ రూ.2,000 కోట్లకు పైగానే ఉంది. ఈ దాడిలో ఐదుగురిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.