4 BJP Workers Killed : త్రిపురలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు బీజేపీ నాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం దక్షిణ త్రిపురలోని గోమతి జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళా నేతలు ఉన్నారు. ఎన్నికల సన్నాహక ర్యాలీకి హాజరై తిరిగి వస్తుండగా శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
భారతీయ జనతా పార్టీ నేతలు, మరికొంత మంది కార్యకర్తలు శుక్రవారం జరిగిన సీఎం ర్యాలీ పాల్గొని మ్యాక్సీ ట్రక్కులో ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో గోమతి జిల్లా అమర్‌పూర్ నాతూన్ బజార్ చెల్లిగంజ్ వద్ద ట్రక్కు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్థానిక నేతలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతులను ఊర్వశి కన్య జమాటియా (45), మమతా రాణి జమాటియా (26), రచనా దేవి జమాటియా (30), గహిన్ కుమార్ జమాటియా (65)గా గుర్తించారు.
అయితే.. ఏప్రిల్ 6న త్రిపుర గిరిజన ప్రాంతాల్లో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి సీఎం బహిరంగ సభకు హాజరైన వీరంతా.. మరికాసేపట్లో తమ స్వస్థలం నాతున్ బజార్‌కు చేరుకుంటారనగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మానిక్ సాహ ఆందోళన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని వారు పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Also Read: