ఉత్తరఖాండ్‌లో పర్యటిస్తున్న యాత్రికులకు ప్రకృతి విపత్తులు అడ్డంకింగా మారుతున్నాయి. తాజాగా పితోరాగఢ్ జిల్లాలోని లఖన్‌పూర్ సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడటం కలకలం రేపింది. దీని ప్రభావం వల్ల లిపులేఖ-తవఘాట్ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకుపోయింది. దీంతో దర్చులా, గుంజి ప్రాంతంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. మరో రెండు రోజుల పాటు ఈ రహదారిని మూసివేయనున్నారు. అయితే ఈసారి చార్‌ధామ్ యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. మంచుకొండల్లో ప్రయాణిస్తున్న వీరికి అక్కడక్కడా కొంత అసౌకర్యం కలగుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ రెండోవారం వరకు ఈ యాత్ర జరగనుంది.
ఇలాంటి సమాయాల్లో కొండచరియలు విరిగిపడటం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. చమోలీ, డెహ్రడూన్, హరిద్వార్, గర్వాల్, చమోలీ, అల్మోరా, పితోరాగఢ్, ఉద్దమ్‌సింగ్ నగర్, తెహ్రీ గర్వాల్, ఉత్తరకాశీ జిల్లాల్లో తుపాను, పాటు ఉరుములు, మెరుపులతో కూడిని వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు యాత్రికులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు సూచించారు. యమునోత్రి, గంగోత్రి యాత్రకు వచ్చే ప్రయాణికులు వాతావరణ సూచన తర్వాతే తమ ప్రయాణంపై ప్రణాళిక చేసుకోవాలని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.