థర్డ్ కోవిద్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్ పీక్ దశలో ఉన్నప్పుడు రోజుకు 28 వేల కోవిద్ కేసులు చూశామని, కానీ మూడో దశలో ఇంతకన్నా ఎక్కువగానే..అంటే రోజుకు 37 వేల కేసులు నమోదైనా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు. ఈ కారణంగా ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన శనివారం మీడియాకు తెలిపారు. అప్పుడే పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ను, రెండు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నామని, అతి ముఖ్యమైన మందులను బఫర్ స్టాక్ గా నిల్వ చేస్తున్నామని ఆయన చెప్పారు. 420 టన్నుల ఆక్సిజన్ స్టోరేజీ కెపాసిటీని సమకూర్చుకుంటున్నాం.. రానున్న కొన్ని వారాల్లో 25 ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేయనున్నాం..64 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం అని ఆయన వివరించారు. థర్డ్ వేవ్ లో ప్రాణవాయువు కొరత రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా పిల్లలను కాపాడుకునేందుకు ప్రత్యేకంగా పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ను నియమిస్తున్నామని, ఆ బృందం చేసే సిఫారసుల ఆధారంగా బాలలకు ప్రత్యేక వైద్య సౌకర్యాలు, ఐసీయూ, బెడ్స్ వంటి ఇతర సదుపాయాలు ఉంటాయని కేజ్రీవాల్ వెల్లడించారు. 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పాదక ప్లాంట్ ను ఏర్పాటు చేయాలనీ ఇంద్రప్రస్థ గ్యాస్ సంస్థను కోరినట్టు చెప్పారు.
ఇదే సమయంలో మూడో వేవ్ ప్రభావాన్ని అదుపు చేయగల చర్యలకు సంబంధించి కార్యాచరణను రూపొందించేందుకు 13 మంది సభ్యులతోను, ఇదిగాక మరో 8 మంది సభ్యులతోను నిపుణుల కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: హాట్ డాన్సుతో కాకరేపిన యాంకర్ విష్ణుప్రియ..బుల్లితెర బ్యూటీ ల మధ్య వార్ ..:Anchor Vishnu priya hot Video.