ప్రపంచ చిత్రపటంపై భారతీయ వృత్తి నిపుణులు వేసిన ముద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు అమెరికా, కెనడా, యూకే వంటి ఆంగ్లం మాట్లాడే దేశాలకే ఎక్కువగా మన నిపుణులు వలస పోయేవారు. ఇప్పుడు ప్రపంచంలో ఏ ఖండంలో, ఏ దేశంలో చూసినా భారతీయ ఇంజనీర్లు, వైద్యులు, ఇతర సాంకేతిక నిపుణులు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఆయా దేశాల్లో కొన్నాళ్లు పనిచేసి, సంపాదించుకుని స్వదేశానికి తిరిగొస్తుంటే.. మరికొందరు అక్కడే శాశ్వతంగా సెటిలైపోతున్నారు. కొన్ని దేశాలు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పిస్తున్నప్పటికీ, చాలావరకు విదేశీ పౌరసత్వం పొందితే భారత పౌరసత్వాన్ని వదులుకోవాల్సిందే.
ఇలా భారత పౌరసత్వం వదులుకుంటున్న వారి సంఖ్య దేశంలో ఓ పెద్ద చర్చకే దారితీస్తోంది. ఇప్పుడు తాజాగా ఓ చిన్న రాష్ట్రంలో భారత పౌరసత్వాన్ని వదులుకున్నవారి సంఖ్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పదేళ్ల కాలంలో ఏకంగా 26 వేల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. సరిగ్గా చెప్పాలంటే 2014 జనవరి 1 నుంచి 2024 మార్చి 31 నాటికి 25,939 మంది గోవా వాసులు తమ భారత పాస్‌పోర్టులను సరెండర్ చేశారు. ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) వెల్లడించిన ఈ గణాంకాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్వయంగా ప్రకటించారు.
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, యూకే వంటి ఇంగ్లిష్ దేశాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా వలస వెళ్తుంటారు. కెనడా, యూకే దేశాలకు వలసవెళ్లే వారిలో పంజాబీలు ఎక్కువగా ఉంటారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవారిలో కేరళ రాష్ట్రానిదే సింహభాగం. అయితే ఈ గోవా వాసుల విషయానికొచ్చేసరికి.. వీరిలో అత్యధికులు పోర్చుగల్ దేశానికి వలస వెళ్తున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుక్కారణం ఏంటంటే..
గోవా వాసులకు పోర్చుగల్ స్పెషల్ ఆఫర్
గోవా పోర్చుగీసు పాలనలో ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందే. 1961 డిసెంబర్ 19న ఆ దేశం నుంచి విముక్తి పొంది, భారత్‌లో విలీనమైంది. ఈ సమయంలో ఆ తేదీ నాటికి గోవాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ పోర్చుగల్ తమ దేశ పౌరసత్వాన్ని ఆఫర్ చేసింది. ఆ తర్వాతి కాలంలో వారి వారసులకు కూడా ఈ ఆఫర్‌ను పొడిగించింది. పోర్చుగీస్ పాస్‌పోర్ట్ కల్గినవారు యూరోపియన్ యూనియన్‌లో ఉన్న దేశాలతో పాటు యూకేలో సైతం వీసా అవసరం లేకుండా తిరగొచ్చు. యూరప్ దేశాల్లో చిన్న చిన్న దేశాల వీసా పొందడమే కష్టతరంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా పౌరసత్వమే అందించే అవకాశం ఉంటే ఎవరు మాత్రం వదులుకుంటారు? గోవాలో అదే జరిగింది. ఇంకా జరుగుతోంది. పోర్చుగల్ పౌరసత్వం కోసం అక్కడి ప్రజలు క్యూ కడుతున్నారు. ఏటా సగటున 2 వేల మందికి పైగా పోర్చుగీసు పౌరసత్వం తీసుకుంటున్నారు.
గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యే యూరి అలమావో వెల్లడించిన గణాంకాల ప్రకారం 2014లో 2,037 మంది తమ భారత పాస్‌పోర్టులను సరెండర్ చేయగా, 2016లో గరిష్టంగా ఆ సంఖ్య 4,121కు చేరుకుంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో 2021లో ఆ సంఖ్య అత్యల్పంగా 954గా నమోదైనప్పటికీ.. 2023లో తిరిగి మళ్లీ 2,094కు చేరుకుంది. మెరుగైన జీవన ప్రమాణాలు, అధునాతన సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో భూలోక స్వర్గంగా పేరొందిన యూరప్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని గోవా వాసులు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..