Bengaluru Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ వచ్చే సూచనలున్నట్లు పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందన్న వార్తలు సైతం వెలువడ్డాయి. అయితే.. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా భయాందోళన నెలకొంది. గత ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా 242 మంది చిన్నారులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా బారిన పడినవారంతా 19 ఏళ్లలోపు వారేనని పేర్కొన్నారు. కరోనా బారిన పడిన వారిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా.. 9 నుంచి 19 ఏళ్ల వయసువారు 136 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు బెంగళూరు మహానగర పాలకమండలి (బీబీఎంపీ) డేటా వివరాలను వెల్లడించింది.
కరోనా థర్డ్ వేవ్ వస్తే చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని భావిస్తున్న తరుణంలో బెంగళూరులో పెద్ద సంఖ్యలో చిన్నారులు మహమ్మారి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వైద్య నిపుణుల సూచనలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చిన్నారులను ఇళ్లల్లనే ఉంచాలని, బయటకు తీసుకురావొద్దంటూ తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
కాగా.. కర్ణాటక రాష్ట్రంలో బుధవారం 1,826 కరోనా కేసులు నమోదు కాగా.. 33 మంది మరణించారు. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 29,22,875 కి చేరగా.. మరణాల సంఖ్య 36,881కి పెరిగింది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 28,63,117 కి పెరిగింది.
Also Read: