23 ఏళ్ల యువతి మేయర్‌గా ఎన్నికై కర్ణాటక రాష్ట్ర రాజకీయ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన డి త్రివేణి సూరి బళ్లారి నగర కార్పొరేషన్ మేయర్‌గా బుధవారం ఎన్నికయ్యారు. దీంతో కర్ణాటకలో మేయర్‌గా ఎన్నికైన అతి పిన్న వయస్కురాలిగా త్రివేణి గుర్తింపు పొందారు. కాంగ్రెస్‌కు చెందిన జానకమ్మ అనే అభ్యర్ధి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన బళ్లారి మేయర్ ఓటింగ్‌లో త్రివేణి 28 ఓట్లతో బీజేపీ అభ్యర్ధి నాగరత్తమ్మపై గెలుపొందారు. నాగరత్తమ్మ16 ఓట్లను మాత్రమే పొందగలిగారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కలిపి సభ మొత్తం ఓటర్ల సంఖ్య 44.
కాగా పారామెడికల్ డిగ్రీ హోల్డర్ అయిన త్రివేణి కాంగ్రెస్ పార్టీ తరపున 18 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విమ్స్ వైద్య కళాశాలలో డిప్లొమా ఇన్‌ఫార్మసీ పూర్తి చేశారు. త్రివేణి ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కార్పొరేటర్ల సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానని త్రివేణి వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.