బెంగాల్ లోని హుగ్లీ జిల్లాకు చెందిన సుమారు 200 మంది బీజేపీ కార్యకర్తలు తిరిగి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. తాము ‘తప్పు’ చేశామని చెప్పుకున్న వీరు.. శిరోముండనం చేయించుకున్నారు. అంతటితో ఆగక.. తమను తాము గంగాజలంతో ”శుద్ది’ చేసుకున్నారు. ఛాలా పెద్ద పొరబాటు చేశామని, పరిశుద్ధమైన గంగాజలంతో తమను తాము ప్రక్షాళన చేసుకున్న తరువాతే తమ మాతృక సంస్థలో చేరుతున్నామని వారు తెలిపారు. టీఎంసీ పతాకాలతో సహా వచ్చి….ఆరాంబాగ్ ఎంపీ అపరూప పొద్దార్ సమక్షంలో వీళ్లంతా ఈ పార్టీలో చేరారు.. ఆయనతో చేతులు కలిపారు. ఆరాంబాగ్ లో పేదలకు తాము ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టగా దళితులు కొందరు వచ్చి తాము బీజేపీలో చేరి పొరబాటు చేశామని..తిరిగి తృణమూల్ కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్నామని చెప్పారని పొద్దార్ వెల్లడించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయంతో వివిధ జిల్లాలనుంచి వందలాది బీజేపీ కార్యకర్తలు మళ్ళీ ఈ పార్టీలో చేరుతున్నారు.
ఈ నెలారంభంలో బీర్ భమ్ జిల్లాకు చెందిన సుమారు 50 మంది బీజేపీ కార్యకర్తలు తృణమూల్ లో చేరిపోయారు. తమను మళ్ళీ పార్టీలోకి చేర్చుకోవాలంటూ పార్టీ కార్యాలయం వద్ద ధర్నా కూడా చేశారు. కమలం పార్టీలో చేరినందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నామని, ఇక తృణమూల్ ను విడబోమని వీరు ముక్త కంఠంతో చెప్పారట.. వీరే కాక..పలువురు సీనియర్ నేతలు కూడా బీజేపీ నుంచి మళ్లీ ఈ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో మాజీ డిప్యూటీ స్పీకర్ కూడా ఉన్నారు. అయితే ఎన్నికల అనంతర హింసతో భయపడిపోయిన వీరంతా మళ్ళీ తృణమూల్ లో చేరారని బీజేపీ నేతలు అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పంజాబ్ కాంగ్రెస్ లో అసమ్మతి చిచ్చు… చిక్కుల్లో సీఎం అమరేందర్ సింగ్ ..నాయకత్వ మార్పు తప్పదా …?