Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు సోమవారం వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకు ఉభయసభలు ఆమోద ముద్ర వేశాయి. అయితే.. లోక్‌సభ, రాజ్యసభలో ఎలాంటి చర్చ లేకుండానే ఇరు సభలు తీర్మానం చేశాయి. అయితే.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే రాజ్యసభలో పలువురు విపక్ష ఎంపీలకు షాక్ తగిలింది. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అసభ్యకరంగా, అనుచితంగా ప్రవర్తించిన ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసింది. శీతాకాల సమావేశాలు ముగిసేవరకు వారిపై వేటు వేస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన 12మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు క్రమశిక్షణ సంఘం ప్రకటించింది. ప్రస్తుతం ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొంది. సస్పెండ్ అయిన సభ్యుల్లో కాంగ్రెస్ నుంచి ఆరుగురు సభ్యులు ఉండగా.. శివసేన, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు చొప్పున, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి.. ఫూలోదేవి నేతం, ఛాయా వర్మ, రిపున్ బోరా, రాజామణి పటేల్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, సయ్యద్ నాసిర్ హుస్సేన్ ఉండగా.. తృణముల్ కాంగ్రెస్ నుంచి డోలా సేన్, శాంతా ఛత్రీ, శివసేన నుంచి ప్రియాంకా చతుర్వేది, అనిల్ దేశాయ్, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, సీపీఎం నుంచి ఎలమరం కరీం ఉన్నారు. కాగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజే విపక్షాల ఆందోళనల పర్వం కొనసాగింది. సాగుచట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుపై విపక్షాలు చర్చకు పట్టుబట్టారు. దీంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
Also Read: