పటియాలా, మార్చి 31: పుట్టిన రోజు సందర్భంగా ఆన్‌లైన్‌లో కేకు ఆర్డర్ పెట్టారు. పార్టీ టైంకి డెలివరీ బాయ్ కేక్ డెలివరీ చేసి వెళ్లాడు. అనంతరం ఆహ్లాదకరంగా బంధుమిత్రుల మధ్య బర్త్ డే వేడుకలు జరుపుకున్న పదేళ్ల చిన్నారి అనూహ్యంగా గంటల వ్యవధిలోనే మృతి చెందింది. ఫుడ్ పాయిజన్ వల్ల బాలిక మృతి చెంది ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేక్ తయారు చేసిన బేకరీ యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ విషాద ఘటన మార్చి 24న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పంజాబ్‌లోని పటియాలాకు చెందిన పదేళ్ల చిన్నారి మాన్వి బర్త్‌డే సందర్భంగా మార్చి 24 పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. దీంతో ఓ బేకరీ నుంచి ఆన్‌లైన్‌లో కేక్ ఆర్డర్ చేశారు. డెలివరీ బాయ్ కేక్ ఇచ్చేసి వెళ్లాడు. దీంతో అదే రోజు సాయంత్రం 7 గంటలకు చిన్నారి మాన్వి కేక్ కట్ చేసింది. మాన్వితోపాటు కుటుంబ సభ్యులంతా కేక్ తిన్నారు. పుట్టినరోజు వేడుకల వీడియోలో బాలికకు ఆమె కుటుంబ సభ్యులు కేక్ తినిపించడం కనిపించింది. దాహంగా ఉందని మాన్వి మంచినీళ్లు తాగి నిద్ర పోయింది అనంతరం మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో మాన్వి తీవ్ర అస్వస్థతకు గురైంది. వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినా చిన్నారి మాన్వి ప్రాణాలు కాపాడలేకపోయారు. మాన్వి చెల్లెలు అధిక సార్లు వాంతులు చేసుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. కేకు విషపూరితం కావడం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
దీంతో బేకరీ యజమానిపై చిన్నారి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేక్ తయారు చేసిన వారిపై ఆరోగ్య శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేక్ నమూనాలను కూడా సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతికి గల అసలు కారణం బయటపడుతుందని, తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.