Encounter: మరోసారి కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..

|

Apr 30, 2024 | 9:36 PM

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎదురు కాల్పుల్లో పది మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులకు పట్టున్న అబుజ్‌ మడ్‌ అటవీ ప్రాంతంలోకి దూసుకుపోయిన పోలీస్‌ బలగాలు ఏరివేత కొనసాగిస్తున్నాయి.

Encounter: మరోసారి కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
Encounter
Follow us on

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాంకేర్‌, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నక్సల్స్‌ పెద్ద సంఖ్యలో హతమయ్యారు. 2 వారాల వ్యవధిలో ఈ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరగడం ఇది రెండోసారి. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్‌మేట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గ్రూప్‌ డీఆర్‌జీ దళాలు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయి. గాలింపు చేస్తూ నక్సల్స్‌ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి. వీరిని చూసి మావోయిస్టులు కాల్పులు జరిపారు. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో మరికొందరు నక్సల్స్‌ పరారయ్యారని పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ఘటనాస్థలం నుంచి ఏకే 47 తుపాకీ, పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ ప్రాంతంలోని కాంకేర్‌ జిల్లాలో ఏప్రిల్‌ 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నాటి కాల్పుల్లో 29 మంది మరణించారు. మృతుల్లో ఉత్తర బస్తర్‌ డివిజన్‌ కమిటీకి చెందిన అగ్ర నాయకులు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు బస్తర్‌ అడవుల్లో దాదాపు 90 మంది నక్సల్స్‌ను భద్రతా సిబ్బంది హతమార్చారు.

మావోయిస్టుల కీలక స్థావరంగా భావించే ఛత్తీస్‌గఢ్‌ అబుజ్‌ మడ్‌ అటవీ ప్రాంతంలోకి జొచ్చుకుపోయిన పోలీస్‌ బలగాలు అణువణువునూ గాలిస్తున్నాయి. మావోయిసట్ఉలను పెద్ద సంఖ్యలో మట్టుబెడుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..