బెంగళూరు, డిసెంబర్ 26: బెంగళూరు రూరల్ పరిధిలోని హోస్‌కోటే ప్రాంతంలో ఒక ఆలయంలో పంపిణీ చేసిన ప్రసాదం తిని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో 135 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారు. ఆలయంలో విషాహారం ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే దర్యాప్తుకు ఆదేశించినట్లు పోలీసులు సోమవారం (డిసెంబర్ 25) తెలిపారు. వివరాల్లోకెళ్తే.. బెంగళూరులోని హోస్‌కోటే ప్రాంతంలో ఓ ఆలయంలో ఆదివారం ప్రసాదం పంపిణీ చేశారు. ఆలయంలోని ప్రసాదం తిన్న అక్కడి భక్తులు వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతూ వేర్వేరు ఆస్పత్రుల్లో చేరారు. ఈ క్రమంలో ఓ మహిళ ఆరోగ్యం విషమించి మృతి చెందింది. మృతురాలిని హోస్కోట్‌లోని కావేరింగర్‌కు చెందిన సిద్దగంగమ్మగా పోలీసులు గుర్తించారు.
దేవాలయలోని ప్రసాదం కారణంగానే ఫుడ్ పాయిజన్ అయ్యి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫుడ్ పాయిజన్‌కు కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. నగరంలోని ఆసుపత్రిలో ఒక ఫ్లోర్ మొత్తం ఐసీయూ పేషెంట్ల కోసం కేటాయించి చికిత్స చేస్తోంది. ప్రసాదం తినడం వల్లే తమ ఆరోగ్యం పాడైపోయినట్లు కొందరు చెప్పగా, ప్రసాదం తినకపోయినా ఆరోగ్య సమస్యలు తలెత్తాయని మరికొందరు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన వారిలో కొందరు డిశ్చార్జి కాగా, మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి ఫుడ్ ఫాయిజన్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున, ప్రస్తుతానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేమని వారు తెలిపారు. వీరిలో అధిక మంది శనివారం హోస్కోట్ పట్టణంలోని ఆలయాన్ని సందర్శించి ప్రసాదం తిన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. విరేచనాలు, వాంతులు లక్షణాలతో ఓ మహిళ సోమవారం ఉదయం మరణించినట్లు ఓ సీనియర్ పోలీస్ తెలిపారు. తొలుత దాదాపు 70 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరినట్లు తమకు సమాచారం అందినట్లు తెలిపారు. ఆ తర్వాత మరో 65 మంది అడ్మిట్ అయ్యారన్నారు. అత్యధికంగా రోగులు చేరిన ఐదు ఆసుపత్రులను ఆరోగ్య శాఖ గుర్తించినట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.