మనిషి జీవితంలో మొదట నేర్చుకునేది మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఏవిధంగా పిలుస్తాడో మాతృభాష కూడా అలాంటిదే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగానే వస్తుంది. అమ్మ అంటే మాతృభాష. అందుకే బిడ్డ అమ్మను కాపాడుకున్నట్లే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలను నేర్చుకోక తప్పదు. ఇతర భాషలను నేర్చుకోవడంలో ఎలాంటి తప్పులేదు. కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా జాగ్రత్తలు పడాలి. మన మాతృభాషను మనం రక్షించుకోవాలి.
దేశంలో సాంస్క్రతిక, భాషా వైవిధ్యం ప్రాముఖ్యతను ప్రోత్సహించేందుకు ప్రతిఏడాది ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటారు. బంగ్లాదేశ్ లో మాతృభాషకోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించారు. అందుకే ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విషయాల సంస్థ యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతిఏడాది ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
చరిత్ర, ప్రాముఖ్యత:
2000వ సంవత్సరం ప్రతి ఏడాది మాతృభాష పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నింటినీ రక్షించుకోవాలని, భాషా వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవవైవిధ్యాన్ని కాపాడుకోగలనమి యునెస్కో అంటోంది. అందరికీ ఈక్విటీ స్థిరమైన అభివ్రుద్ది లక్ష్యాలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. 2002నాటి ఐక్యరాజ్యసమితి తీర్మానంపై యూఎన్ జనరల్ అసెంబ్లీ యూఎన్ దినోత్సవ ప్రకటనకు మద్దతు ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ తీర్మానంలో సభ్యదేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మాట్లాడే అన్ని భాషలను సంరక్షించడానికి, రక్షించడానికి చర్య తీసుకోవాలని ప్రోత్సహిస్తోంది.
అంతర్జాతీ మాతృభాషా దినోత్సవం థీమ్:
అంతర్జాతీ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రతిఏడాది ఒక థీమ్ ను యునెస్కో ప్రకటిస్తోంది. అయితే 2023కు సంబంధించిన థీమ్ ఇంకా ప్రకటించలేదు. అయితే 2022 థీమ్ బహుభాషా అభ్యాసం కోసం సాంకేతికతను ఉపయోగించడం. సవాళ్లు మరియు అవకాశాలు, విద్య మరియు సమాజంలో చేర్చడం కోసం బహుభాషావాదాన్ని ప్రోత్సహించడం అనే థీమ్ తో గతేడాది యూనెస్కో ఈ దినోత్సవాన్ని నిర్వహించింది.
అంతర్జాతీ మాతృభాషా దినోత్సవం వేడుకలు:
యునెస్కో ప్రకారం అంతర్జాతీ మాతృభాషా దినోత్సవం 24వ ఎడిషన్ బహుభాషా విద్య-విద్యను మార్చడానికి ఒక ఆవశ్యకత అనే అంశంపై ద్రుష్టి సారిస్తుంది. ఫిబ్రవరి 21న యునెస్కో నిర్వహించే కార్యక్రమం జీవితకాల అభ్యాస ద్రుక్పథం నుంచి విభిన్న సందర్భాల్లో విద్యను మార్చడానికి బహుభాషావాదం సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా యునెస్కో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలామంది కవులు చెప్పారు. నేటి ప్రపంచంలో దేశాల మధ్య దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంత పెరిగాయో తెలిసిందే. రకరకాల పనుల కోసం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడం సాధారణంగా మారింది. అందుకే ఇంగ్లీష్ అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది. మన భాషను, సంస్క్రుతినీకాపాడుకోవడం, భావితరాలవారికి దీన్ని అందిస్తూ ఆ భాషా సౌందర్య సంపదను కాపాడటం మన అందరి కర్తవ్యం.