
ప్రతి ఉదయం తెల్లవారుజామున నిద్రలేచే అలవాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే చాలా మంది తెల్లవారుజామున 4-5 గంటలకు నిద్రలేచి వాకింగ్‌కు వెళుతుంటారు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదించడానికి, రద్దీ లేకుండా హాయిగా వాకింగ్ చేయడానికి వీలు కలుగుతుంది. అయితే నేటి కాలంలో చాలా మంది రాత్రి పొద్దుపోయే వరకు పని చేసి అర్ధరాత్రి 11, 12 గంటలకు నిద్రపోతున్నారు. ఈ అలవాటు వారి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అసలు ఉదయం ఏ సమయంలో నిద్రలేవడం ఆరోగ్యానికి మంచిది? దీని గురించి సైన్స్ ఏమి చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
శాస్త్రవేత్తలు, నిద్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం త్వరగా నిద్ర లేవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సూర్యోదయం సమయంలో మేల్కొనడం ద్వారా శరీర జీవ గడియారం (దీన్ని సిర్కాడియన్ రిథమ్ అని కూడా పిలుస్తారు) సక్రమంగా మారుతుంది. ఈ సహజ చక్రం ఒంట్లో హార్మోన్లు, శక్తి స్థాయిలు, మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. రాత్రి ఆలస్యంగా నిద్ర పోవడం వల్ల శరీర సహజ గడియారం సమతుల్యత దెబ్బతింటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రిళ్లు 7 నుంచి 8 గంటలు తగినంత మంచి నిద్ర పొందడం చాలా ముఖ్యం. మీరు రాత్రి ఆలస్యంగా నిద్రపోయి 7-8 గంటల నిద్ర పూర్తి చేసినా ప్రయోజనం ఉండదు. రాత్రి 10 గంటలకు నిద్రపోయి ఉదయం 5-6 గంటలకు మేల్కొనడానికి ప్రయత్నించాలి. ఇది సిర్కాడియన్ లయను సమతుల్యంగా ఉంచుతుంది. శరీరానికి సరిపడా నిద్ర కూడా అందుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం 9-10 గంటల వరకు నిద్రపోయే వ్యక్తులు నీరసంగా, చిరాకుగా, రోజంతా ఏకాగ్రత లేకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. ఆలస్యంగా మేల్కొనడం వల్ల ఆహారం, పని, నిద్ర విధానాలకు అంతరాయం కలుగుతుంది. ఇది మీ శరీర జీవ గడియారాన్ని చెడగొడుతుంది. ఇది ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్రతి ఒక్కరి జీవ గడియారం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కానీ సూర్యోదయం సమయంలో మేల్కొనే వ్యక్తులు మరింత చురుకుగా, సానుకూలంగా, మానసికంగా సమతుల్యంగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.