Chicken: చికెన్‌ను కడగొద్దా..? వాష్ చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదా.. ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..

చికెన్‌ను వండే ముందు కడగడం ఆరోగ్యానికి మంచిదనే భావన చాలా మందిలో ఉంది. అయితే పచ్చి చికెన్‌ను నీటితో కడగడం వల్ల సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా వంటగది అంతా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్‌ను సురక్షితంగా తినాలంటే సరైన ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా ఉడికించడమే ఉత్తమ మార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పసుపు, ఉప్పు, నిమ్మరసంతో మారినేషన్ చేయడం, వంటగదిని శుభ్రంగా ఉంచడం వంటి జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

Chicken: చికెన్‌ను కడగొద్దా..? వాష్ చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదా.. ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..
Washing Chicken

Updated on: May 31, 2026 | 10:00 AM

సండే వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు.. చికెన్ ను ఇష్టంగా తింటారు. కర్రీ, ఫ్రై తోపాటు.. పలు రకాలుగా వండుకుని ఆస్వాదిస్తారు.. అయితే.. వండే ముందు చికెన్‌ను కడగడం అనేది అనేక భారతీయ గృహాల్లో సర్వసాధారణమైన అలవాటు. అయితే, ఈ పద్ధతి ఆరోగ్యానికి హానికరం కావచ్చని ఆధునిక పరిశోధనలు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు వెల్లడిస్తున్నాయి. మన పూర్వీకులు శుచిని ఆహార భద్రతకు కీలకమైన అంశంగా పరిగణించినప్పటికీ, చికెన్‌ను నీటితో శుభ్రం చేయడం వాస్తవానికి అశుద్ధికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.. చాలామంది చికెన్‌ను కడగడం వల్ల దాని జిగురు, రక్తం మరకలు పోతాయని, కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు నశిస్తాయని నమ్ముతారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే. నీరు బ్యాక్టీరియాని చంపదు, పైగా దాని వ్యాప్తికి కారణమవుతుంది. పచ్చి చికెన్‌పై సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్, ఈ-కోలై వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుంది. కుళాయి కింద చికెన్‌ను కడిగినప్పుడు, నీటి తుంపర్లు (స్ప్లాషింగ్) సింక్, పక్కన ఉన్న గిన్నెలు, కటింగ్ బోర్డులు, చివరికి వంట చేసేవారి బట్టలపైనా పడతాయి. దీనిని క్రాస్-కంటామినేషన్ అంటారు. అంటే, మీరు చికెన్‌ను శుభ్రం చేస్తున్నారని అనుకుంటూనే, ఆ ప్రమాదకరమైన బ్యాక్టీరియాని వంటగది అంతా విస్తరింపజేస్తున్నారన్నమాట. ఇంటి భోజనం తిన్నప్పటికీ అనారోగ్యం పాలవడానికి ఇది ఒక ప్రధాన కారణమని పరిశోధకులు వివరించారు.

ఈ సమస్యకు నిజమైన పరిష్కారం అగ్ని అని ఆయుర్వేదం సూచిస్తుంది. ఆయుర్వేదంలో అగ్నికి సర్వరోగ నివారిణిగా ప్రాముఖ్యత ఉంది. చికెన్‌ను సురక్షితంగా మార్చడానికి ఏకైక మార్గం దానిని బాగా ఉడికించడమే. చికెన్ లోపలి ఉష్ణోగ్రత సుమారు 74 డిగ్రీల సెల్సియస్ (165 ఫారెన్‌హీట్) వరకు వండినప్పుడు హానికరమైన సూక్ష్మజీవులన్నీ నశిస్తాయి. నీటితో ఎంత కడిగినా చనిపోని క్రిములు సరైన వేడి తగలగానే నశిస్తాయి. కాబట్టి, నీటి శుద్ధి కంటే అగ్ని శుద్ధి ఇక్కడ ముఖ్యం..

చికెన్‌కు జిగురు లేదా నీచు వాసన వస్తే.. అది చెడిపోయిన మాంసం అయి ఉండవచ్చు. అలాంటి మాంసాన్ని వండటం కంటే పారవేయడమే మంచిది. కడగడం వల్ల చెడిపోయిన మాంసం బాగుపడదు. కేవలం తడిని పోగొట్టాలనుకుంటే, నీటితో కడగడానికి బదులుగా శుభ్రమైన పేపర్ టవల్‌తో అద్ది, ఆ పేపర్లను వెంటనే డస్ట్ బిన్‌లో వేయాలి. ఆ తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోకూడదు.

ప్రపంచ ప్రఖ్యాత ఆరోగ్య సంస్థలైన సీడీసీ (Centers for Disease Control and Prevention), ఎఫ్‌డీఏ (Food and Drug Administration) కూడా పచ్చి చికెన్‌ను వండే ముందు కడగకూడదని సిఫార్సు చేస్తాయి. చికెన్‌ను నేరుగా గిన్నెలో వేసి వండటమే ఉత్తమం. వంట పూర్తయిన తర్వాత, చికెన్‌తో సంబంధం ఉన్న ప్రతి వస్తువును, ప్రదేశాన్ని వేడి నీళ్లు, సబ్బుతో శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

భారతీయ వంటగదికి సరిపోయే కొన్ని సురక్షితమైన చిట్కాలు ఉన్నాయి. పసుపు, ఉప్పుతో మారినేషన్ చేయడం ఒక పద్ధతి. చికెన్‌ను గిన్నెలోకి తీసుకొని, నీళ్లు చిమ్మకుండా ఒకసారి కడిగి, నీరు వంపేసి, దానికి పసుపు, కల్లు ఉప్పు పట్టించి పది నిమిషాలు పక్కన పెట్టవచ్చు. పసుపు సహజ సిద్ధమైన క్రిమిసంహారిణిగా పనిచేసి విషతుల్యాల్ని లాగేస్తుంది, ఉప్పు బ్యాక్టీరియాని అరికడుతుంది. ఇంకొక పద్ధతి నిమ్మరసాన్ని ఉపయోగించడం. చికెన్ ముక్కల పైన నిమ్మరసం పిండి కలపడం వల్ల అందులోని ఆమ్ల గుణం కొంతవరకు బ్యాక్టీరియాని నివారిస్తుంది. ఇది మాంసాన్ని మృదువుగా కూడా మారుస్తుంది.

సింక్, పరిసరాల శుద్ధి చాలా అవసరం. చికెన్ కడిగిన తర్వాత సింక్‌లో వెంటనే కూరగాయలు లేదా పండ్లు కడగకూడదు. వేడినీళ్లలో కొంచెం వెనిగర్ లేదా నిమ్మరసం కలిపి సింక్, పంపును శుభ్రం చేయాలి. ఆయుర్వేదం ప్రకారం.. వేపాకు మరిగించిన నీటితో వంటగది స్లాబ్‌ను తుడవటం వల్ల సూక్ష్మక్రిములు నశిస్తాయి. అంతిమంగా, ఆహార భద్రత మన అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. పచ్చి చికెన్ విషయంలో నీటితో చేసే శుద్ధి కంటే, వేడితో చేసే పద్దతే నిజమైన రక్షణ అని.. పేర్కొంటున్నారు ఆహార నిపుణులు..

అయితే.. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సందేహాలున్నా.. అనారోగ్య సమస్యలున్నా నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us