Srisailam – Traffic Jam – Project Beauty: కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయం దగ్గర భారీగా ట్రాపిక్ జామ్ అయింది. ఫలితంగా సున్నిపెంట ప్రాంతం నుండి దోమలపెంట వరకు బారులుతీరి వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 5 కిలోమీటర్ల మేర రోడ్డుపై ట్రాపిక్ జామ్ కావడంతో వాహనాలలో గంటల తరబడి కూర్చుని యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైల మల్లిఖార్జునుడి దర్శనంతోపాటు, నీటితో పరవళ్లు తొక్కుతోన్న శ్రీశైలం డ్యాంను కూడా సందర్శించేందుకు సందర్శకులు పెద్ద మొత్తంలో తరలి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు చోటుచేసుకున్నాయి.
ఇలా ఉండగా, ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరివాహాక ప్రాంతమంతా జలకళతో కళకళలాడుతుంది. బిరా బిరా కృష్ణమ్మ పరుగులు పెడుతూ శ్రీశైలం పరమశివుడికి అభిషేకిస్తోంది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో.. కొత్త అందాలతో కనువిందు చేస్తున్నాయి. ఆ నీటి సోయగం పర్యాటకులను కనువిందు చేస్తోంది.
వరదనీరు ఉధృతంగా వస్తుండంతో శ్రీశైలం ప్రాజెక్ట్ నిండింది. 10 గేట్లు ఎత్తి, నీటిని కిందకు వదులుతున్నారు. దిగువకు వస్తున్న నీళ్లు.. పాలనురుగుతో శ్రీశైలంలో సుందర దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. 2007 తర్వాత జూలైలో ప్రాజెక్టు పూర్తిగా నిండటం, గేట్లు ఎత్తడం ఇదే తొలిసారన్నారు అధికారులు.
అటు, కృష్ణమ్మ పరివాహాక ప్రాంతమంతా జళకళతో నిండిపోయింది. జూరాల ప్రాజెక్ట్ 45 గేట్లు.. ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు ప్రాజెక్టు అధికారులు.తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో ..నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. ఇదే ఫ్లో కొనసాగితే.. సాగర్ గేట్లు కూడా మరో మూడు నాలుగు రోజుల్లో తెరుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం లక్ష పైగా క్యూసెక్కులు వరద వస్తోంది.
Read also: Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఢీ కొట్టబోయేది ఇతడే.. గులాబీ బాస్‌కు ఫుల్ క్లారిటీ.!