Mysterious Lakes: మన దేశంలో సీజన్ కి అనుగుణంగా నీటి రంగుని మార్చుకునే సరస్సులు ఇవే.. ఒక్కసారైనా చూడాల్సిందే..

మంచి నీటి సరస్సు కొల్లేరు, ఉప్పు నీటి సరస్సు పులికాట్ వంటి సరస్సులతో పాటు అనేక సరస్సులు మన దేశంలో ఉన్నాయి. ఈ సరస్సులను చూసి ఉంటారు. అయితే వాతావరణం, సమయంతో పాటు నీటి రంగు మారే సరస్సులను మీరు చూసి ఉండరు. అవును.. ఉసరవెల్లి వలెనే రంగులు మార్చుకునే సరస్సులు ఉన్నాయని చెబుతుంటే ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది నిజం. ఈరోజు మన దేశంలో రంగులు మార్చుకునే ఐదు సరస్సుల గురించి తెలుసుకుందాం..

Mysterious Lakes: మన దేశంలో సీజన్ కి అనుగుణంగా నీటి రంగుని మార్చుకునే సరస్సులు ఇవే.. ఒక్కసారైనా చూడాల్సిందే..
Color Changing Lakes India

Updated on: Jul 10, 2025 | 8:57 PM

మన దేశంలో చాలా సరస్సులను చూసి ఉంటారు. అయితే వాతావరణం, సమయానికి అనుగుణంగా రంగు మారే సరస్సులను ఎప్పుడైనా చూశారా.. కొంచెం వింతగా అనిపించవచ్చు. ఇది పూర్తిగా నిజం. ఇలా నీటి రంగు మార్చుకునే సరస్సులు మన భారతదేశంలోనే ఉన్నాయి. ఈ సరస్సులు వాతావరణం, సూర్యకాంతి, ఉష్ణోగ్రత, సహజ అంశాల ప్రభావం వల్ల వాటి రంగును మార్చుకుంటాయి.

ఈ సరస్సులు శాస్త్రవేత్తలకు చేధించని ఒక రహస్యం. ప్రయాణ ప్రియులకు కూడా ఒక వింత అనుభవం లాంటివి. రంగు మారుతున్న ఈ సరస్సులు కాలక్రమేణా ఆకుపచ్చ, నీలం, గులాబీ, ఊదా లేదా బూడిద రంగుల్లో కనిపిస్తాయి. ఇది ప్రకృతిలో అద్భుతం. ఇది నిజంగా మాయాజాలం కంటే తక్కువ కాదు. భారతదేశంలో ఈ సరస్సులు ఎక్కడ ఉన్నాయి? ఏ సరస్సు ఏ రంగులో మారుతుందో ఈ రోజు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

లోనార్ సరస్సు, మహారాష్ట్ర: మహారాష్ట్రలోని లోనార్ సరస్సు. ఇది బుల్ధానా జిల్లాలో ఉంది. ఈ సరస్సు అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఏర్పడిందని చెబుతారు. ఈ సరస్సు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే 2020 లో ఈ సరస్సులోని నీటి రంగు అకస్మాత్తుగా ఆకుపచ్చ నుంచి గులాబీ రంగులోకి మారినప్పుడు..చర్చనీయాంశంగా మారింది. సరస్సులో ఉన్న ఆల్గే, ఉప్పు కారణంగా నీటి రంగు మారుతుందని నమ్ముతారు. వేసవిలో నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు.. ఈ నీటి రంగు మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

పాంగోంగ్ త్సో సరస్సు, లడఖ్: ఆమిర్ ఖాన్ సినిమా 3 ఇడియట్స్ లో చూపించిన పాంగోంగ్ సరస్సు గురించి చాలా మందికి తెలుసు. ఈ సినిమా వల్ల ఈ సరస్సు మరింత ప్రాచుర్యం పొందింది. అయితే ఈ సరస్సులోని నీటి రంగు మారుతుందని తెలుసా.. అవును ఈ సరస్సులో నీరు నీలం రంగులో ఉంటుంది.. బూడిద రంగులోకి మారుతుంది. సూర్యకాంతి, వాతావరణం, అధిక ఎత్తులో ఉన్న మేఘాల ప్రభావం వల్ల ఈ మార్పు జరుగుతుందని చెబుతారు. సముద్ర మట్టానికి 14,270 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరస్సు దాదాపు 134 కిలోమీటర్ల పొడవు ఉంది.

సాంబార్ సాల్ట్ లేక్, రాజస్థాన్: రాజస్థాన్‌లో సాంబార్ సాల్ట్ లేక్ కూడా రంగు మారే సరస్సు. ఈ సరస్సు ఉప్పునీటికి ప్రసిద్ధి చెందింది. అయితే ఈ సరస్సులోని నీరు చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సరస్సు నీలం నుంచి ఊదా, గులాబీ రంగులోకి కూడా మారుతుంది. వర్షాకాలంలో ఈ సరస్సు నీరు రంగు మారడాన్ని మీరు చూడవచ్చు. ఫ్లెమింగో పక్షులు కూడా ఈ సరస్సు వద్దకు వచ్చి ఈ సరస్సు అందాన్ని పెంచుతాయి.

చాంగు సరస్సు, సిక్కిం: స్థానిక ప్రజలు సిక్కింలోని సోమ్గో సరస్సును పవిత్రమైన సరస్సుగా భావిస్తారు. ఈ సరస్సుతో అనేక పురాణ కథలు కూడా ముడిపడి ఉన్నాయి. ఈ సరస్సు హిమానీనదం నుంచి వచ్చే నీటితో నిండి ఉంటుంది. ఈ సరస్సులోని నీరు ఒకొక్క సీజన్ లో ఒకొక్క రంగులో కనిపిస్తుంది. శీతాకాలంలో ఇది పూర్తిగా ఘనీభవిస్తుంది. వేసవిలో ఈ సరస్సు నీరు నీలం, ఆకుపచ్చగా మారుతుంది. ఈ సరస్సు రంగు మారడం అందం చూడటం ఒక అందమైన అనుభవం.

మైన్‌పాట్ సరస్సు (సర్గుజా చెరువు), ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా ప్రాంతంలో ఉన్న మైన్‌పాట్ సరస్సు నీటి రంగు కూడా మారుతుంది. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం గురించి తెలుసు. ఈ సరస్సును సర్గుజా తలాబ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి నేల, నీటి కూర్పు సూర్యుని దిశ, రోజు సమయాన్ని బట్టి దాని నీరు వివిధ రంగులలో కనిపిస్తుంది. స్థానిక ప్రజలు దీనిని ఒక మర్మమైన సరస్సుగా భావిస్తారు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)