Chennai tour : చెన్నై మహానగరం అంటే ప్రజలకు, పర్యాటకులకు ఎంతో ఇష్టం. అయితే ఇంత పెద్ద నగరాన్ని మొత్తం చూడాలంటే సమయంతో పాటు వ్యయం కూడా అధికంగానే ఉంటుంది. ఇకపై మాత్రం పర్యాటకులకు ఈ బాధలు అవసరం లేదంటున్నారు చెన్నై మెట్రో అధికారులు. కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే చెన్నై నగరాన్ని చుట్టి రావొచ్చని చెబుతున్నారు. చెన్నైలోని నాలుగు దిక్కులను కలుపుతూ 118.9 కిలోమీటర్ల దూరానికి మెట్రో రైల్వే రింగ్ ట్రాక్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. 2026 నాటికి ఈ సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
చెన్నై నగరంలో రెండు మార్గాల మెట్రో రైలు సేవలు 55 కిలో మీటర్ల వరకు కొన్నేళ్లుగా అందుబాటులో ఉన్నాయి. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో రెండో దశలో మూడవ ట్రాక్ పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. గత ఏడాది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ పనులకు సంబంధించి శంకుస్థాపన చేశారు. 69 వేల కోట్ల అంచనాతో 128 రైల్వేస్టేషన్ల నిర్మాణానికి సంబంధించి తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. మూడు, నాలుగు, ఐదు ట్రాక్‌ల నిర్మాణానికి ప్రారంభ పనులు జరుగుతున్నాయి.
నూతనంగా నిర్మిస్తున్న కొత్త మెట్రోరైలు సేవలు అందుబాటులోకి వస్తే రెండున్నర గంటల సమయంలోనే చెన్నై మహానగరం ఉత్తరం నుంచి దక్షిణం వరకు చుట్టి రావచ్చు. మాధవరం నుంచి షోళింగనల్లూరు వరకు, తూర్పు దిశలోని అడయారు మీదుగా చెన్నైలోని ఉత్తర భాగాన ఉన్న కోయంబేడు వరకు ట్రాక్‌లను నిర్మించనున్నారు. రింగ్ ట్రాక్ మార్గంలో మూడు, ఐదు ట్రాక్‌లైన్‌లను అనుసంధానం చేస్తూ సెంట్రల్ మెట్రో రైల్వేస్టేషన్‌ను కోయంబేడు మీదుగా చెన్నై మీనంబాక్కం ఎయిర్ పోర్టు రైల్వేస్టేషన్‌ను కలిపేలా ఒకటి, రెండు ట్రాక్‌లను అనుసంధానం చేస్తారు.
Read also : Mamata Banerjee : మమతా బెనర్జీ హస్తిన పర్యటన, ఇవాళ ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేతలతో కీలక భేటీలు