Moral Story: మూడు చేపల కథ.. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుంటే భారీ నష్టం తథ్యం..!

Three Fish Moral Story: కొందరు స్వయం కృషి కంటే.. అదృష్టాన్నే ఎక్కువగా నమ్ముకుంటారు. ఆపద ముంచుకొస్తున్నా.. ఆ పరిస్థితిని అధిగమించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోరు. ఇలా సరైన ముందుచూపు లేకుండా కేవలం అదృష్టాన్ని నమ్ముకుంటే జీవితంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మూడు చేపల కథ కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. పిల్లల్లో సమస్యలను ఎదుర్కునే నేర్పు, ఆలోచనా శక్తిని పెంచే ఈ నీతి కథను చదివేద్దాం రండి..

Moral Story: మూడు చేపల కథ.. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుంటే భారీ నష్టం తథ్యం..!
Three Fish Moral Story
Image Credit source: AI

Updated on: Jun 22, 2026 | 4:39 PM

నీతి కథలు కేవలం పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఈ కథలు నిజాయితీ, క్రమశిక్షణ, దయ, సహనం వంటి విలువలను నేర్పుతాయి. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాలి, ఆలోచనా శక్తిని పెంచి పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతాయి. జీవిత పాఠాలను చిన్న కథల రూపంలో గుండెలకు హత్తుకునేలా ఇవి ఉపయోగపడుతాయి. ముందుచూపు లేకుండా.. కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మూడు చేపల కథ బోధిస్తుంది.

కథ

ఒకప్పుడు ఓ ప్రశాంతమైన చెరువులో అనేక చేపలు సంతోషంగా జీవించేవి. వాటిలో మూడు పెద్ద చేపలు మంచి స్నేహితులు. ఒక రోజు ఇద్దరు జాలర్లు ఆ చెరువు పక్కన వెళ్తూ, అందులో ఉన్న చేపలను చూసి మరుసటి రోజు అక్కడికి వచ్చి చేపలు పట్టాలని నిర్ణయించుకున్నారు. వారి మాటలను ఒక పెద్ద చేప విని వెంటనే మిగతా రెండు చేపలకు విషయం చెప్పింది.

“మన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రాత్రే మరో చెరువుకు వెళ్లిపోవాలి. ఆలస్యం చేస్తే ప్రమాదం తప్పదు” అని మొదటి చేప హెచ్చరించింది. అయితే రెండో చేప, “వాళ్లు నిజంగానే వస్తే అప్పుడు చూద్దాం” అని అనుకుంది. మూడో చేప మాత్రం, “అదృష్టం బాగుంటే ఏమీ జరగదు. అవసరం లేని భయం ఎందుకు?” అని నిర్లక్ష్యంగా స్పందించింది.

ఇవి కూడా చదవండి

ఆ రాత్రే మొదటి చేప తన కుటుంబంతో కలిసి మరో చెరువుకు వెళ్లిపోయింది. మరుసటి ఉదయం జాలర్లు వస్తున్నట్లు చూసిన రెండో చేప కూడా వెంటనే తన కుటుంబంతో అక్కడి నుంచి తప్పించుకుంది. కానీ మూడో చేప మాత్రం కేవలం అదృష్టాన్ని నమ్ముకుని అక్కడే ఉండిపోయింది. చివరకు జాలర్లు వేసిన వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది.

నీతి

ఈ మూడు చేపల చిన్న కథ మన జీవితానికి ఉపయోగపడే గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ముందుచూపుతో నిర్ణయాలు తీసుకునే వారు అనేక సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. రాబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించిన వెంటనే ముందస్తు చర్యలు తీసుకునే వారు నష్టాన్ని తగ్గించుకోగలరు. కానీ కేవలం అదృష్టాన్ని నమ్ముకుని కూర్చుంటే అవకాశాలను మాత్రమే కాదు.. కొన్నిసార్లు జీవితంలో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.

విద్య, ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితం ఏదైనా కావచ్చు… విజయం సాధించాలంటే దూరదృష్టి, సరైన ప్రణాళిక, సమయానికి తీసుకునే నిర్ణయాలు ఎంతో అవసరం. అదృష్టం అనేది మన కృషికి తోడుగా ఉండాలి గానీ, కృషికి ప్రత్యామ్నాయం కాదు. అందుకే ” అదృష్టాన్ని మాత్రమే నమ్ముకోకుండా సమయానికి స్పందించేవారే విజయాన్ని అందుకుంటారు” అనే నీతిని ఈ మూడు చేపల కథ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది.

Also Read: పాముకి గుణపాఠం చెప్పిన కోడిపెట్ట..బలం కంటే తెలివి గొప్పది..!

Follow Us