
దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటైన UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షకు భారతదేశం నలుమూలల నుంచి లక్షలాది మంది అభ్యర్థులు ప్రతి సంవత్సరం హాజరవుతారు. IAS, IFS లేదా IPS అధికారులు అవ్వాలని దేశానికి సేవ చేయ్యాలని సివిల్ సర్వీసెస్‌లో చేరి తమ కలను నెరవేర్చుకోవాలని కోరుకుంటారు. అయితే భారతదేశంలో అత్యధిక సంఖ్యలో IAS, IPS అధికారులున్న ఘనతను కలిగి ఉన్న ఒక గ్రామం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఒక చిన్న గ్రామంలో కేవలం 75 ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ కేవలం 4,000 మంది జనాభా నివసిస్తున్నారు.
‘UPSC గ్రామం’ ఎక్కడ ఉంది?
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం పేరు మాధోపట్టి. దీనిని ‘UPSC ఫ్యాక్టరీ అని అంటారు. IAS, PCS, IPS అధికారులతో సహా 47 మంది పౌర సేవకులను మన దేశానికి అందించింది. ఈ గ్రామంలో మొత్తం 75 ఇళ్ళు, 4,000 కంటే కొంచెం ఎక్కువ జనాభా ఉంది. ప్రతి ఇంట్లో కనీసం ఒక ఉన్నత స్థాయి అధికారి ఉంటారు. మాధోపట్టి గ్రామస్థులలో సివిల్ సర్వీసెస్‌తో పాటు, ఇస్రో, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ప్రపంచ బ్యాంకులో కూడా ఉన్నత పదవులను చేపట్టారు.
విజయ పరంపర ఎలా మొదలైందంటే..
మీడియా నివేదికల ప్రకారం మాధోపట్టి గ్రామం నుంచి UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సివిల్ సర్వీసెస్‌లో చేరిన వ్యక్తి ఇందు ప్రకాష్ సింగ్. 1952లో IFS అధికారి అయ్యారు. ఆయన స్పూర్తితో మూడు సంవత్సరాల తరువాత వినయ్ కుమార్ సింగ్ 1955లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష ఉత్తీర్ణులై ఆ గ్రామానికి మొదటి IAS అధికారి అయ్యారు. ఆయన బీహార్ ప్రధాన కార్యదర్శిగా పని చేసే స్థాయికి చేరుకున్నారు. వీరి సక్సెస్ ఆ గ్రామస్తుల యువతకు స్పూర్తినిచ్చింది. దీంతో చదువుకునే సమయం నుంచే తమ లక్ష్యం చేరుకునేందుకు బాటలు వేసుకుంటారు.
మధోపట్టిలో IAS, IPS అధికారులే ఎందుకంటే
ఈ గ్రామంలోని స్టూడెంట్స్ కు సివిల్ సర్వీసెస్ పట్ల ఒక ప్రత్యేకమైన మక్కువ ఉంది. దీంతో విద్యార్థులు పాఠశాల విద్య పూర్తి చేసిన వెంటనే సివిల్ సర్వీసెస్‌ను లక్ష్యంగా చేసుకుని సాధన ప్రారంభిస్తారు. తమ కళ్లముందే ఎందరో సీనియర్లు అధికారులుగా మారడం చూసి యువతలో పట్టుదల పెరుగుతుంది. దీంతో వీరు USPC CSE కోసం సిద్ధం కావడం ప్రారంభిస్తారు. బాలురు, బాలికలు తమ లక్ష్యంపై దృష్టి పెట్టి తమ లక్ష్యాన్ని చెందించే దిశగా అడుగులు వేస్తారు.
కొంతమంది అగ్రశ్రేణి IAS అధికారులకు మాధోపట్టి నిలయం. వీరిలో చాలామంది ప్రధానమంత్రి కార్యాలయం (PMO), ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)తో సహా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నత పదవులను అలంకరించారు. అంతేకాదు ఈ గ్రామంలోని ఒకే కుటుంబంలోని నలుగురు సోదరులు (ఇద్దరు IAS, ఇద్దరు IPS) యూపీఎస్సీలో ఉత్తీర్ణులయ్యారు. ఇది తమ గ్రామంలో చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అని అంటారు. ఇది గ్రామంలో యువతకు గొప్ప ప్రేరణగా నిలిచింది. ఒకరికొకరు సాయం చేసుకుంటూ మార్గనిర్దేశం చేసుకుంటూ పరీక్షలకు రెడీ అవుతారు.
అయితే ఈ గ్రామంలో IAS, IPS అధికారులే కాదు ఈ గ్రామంలో ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ జ్ఞాను మిశ్రా మరియు ప్రపంచ బ్యాంకులో పనిచేసిన జనమేజయ్ సింగ్ కూడా ఉన్నారు. వివిధ రంగాల్లో విధులను నిర్వహిస్తూ తమ గ్రామ కీర్తిని దేశం నలు దిశలా చాటుతున్నారు ఆ గ్రామ యువత.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..