సమయపాలన లేని నిద్రాహారాల కారణంగా చాలా మంది ప్రజలు చిన్న వయస్సులోనే అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలిని అనుసరిస్తే.. మీ వయస్సు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏకంగా 24 సంవత్సరాలు అధికంగా బ్రతికేయొచ్చకు. ఇది మేం చెబుతున్న మాట కాదు. తాజాగా సైంటిస్టులు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన ప్రకారం.. ప్రజలు 8 ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం ప్రారంభిస్తే.. 24 సంవత్సరాలు ఎక్కువ జీవించవచ్చు. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ వార్షిక సమావేశంలో న్యూట్రిషన్ 2023 పేరుతో నివేదికను వెల్లడించారు. దీనిప్రకారం.. ప్రజలు కొన్ని అలవాట్లను అనుసరిస్తే.. మధ్య వయస్కులు సైతం తమ ఆయుష్షును పెంచుకోవచ్చునని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించే వారిలో పురుషుల వయస్సు 24 సంవత్సరాలు, స్త్రీల వయస్సు 21 సంవత్సరాలు పెరిగినట్లు 7 లక్షల మందిపై చేసిన పరిశోధనలో వెల్లడైంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. 40, 50, 60 సంవత్సరాల వయస్సులో కూడా ఈ అలవాట్లను అలవర్చుకుంటే.. ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పరిశోధనలో నమోదు చేసుకున్న 7,19,147 మంది వ్యక్తుల డేటా, వైద్య రికార్డులను పరిశోధకులు పరిశీలించారు. వీరందరినీ వెటరన్ ఎఫైర్ మిలియన్ వెటరన్ ప్రోగ్రామ్‌తో అనుబంధించారు. ఈ కార్యక్రమం జన్యువులు, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యానికి సంబంధించి పరిశోధకులకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
పరిశోధకుల ప్రకారం.. శారీరకంగా చురుకుగా ఉండటం, శారీరక శ్రమలో పాల్గొనడం, ధూమపానం మానేయడం, ఒత్తిడిని నివారించడం, ఆరోగ్యమైన ఆహారం తినడం, ఆల్కహాల్ మానేయడం, తగినంత నిద్ర, వ్యక్తులతో కలిసిమెలిసి ఉండటం, మాట్లాడటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మీ జీవిత కాలాన్ని పెంచుతాయి. .ఈ అలవాట్లను అవలంబించిన వ్యక్తులు ఇతరులతో పోలిస్తే మరణాల రేటు 87 శాతం తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారు.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు అధ్యయనంలో పేర్కొన్న అంశాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..