నేటి జీవనశైలి, క్రమం తప్పిన ఆహారపు అలవాట్ల కారణంగా కిడ్నీ సమస్యలు ప్రతీ యేట పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు. శరీరంలోని వ్యర్ధాలను తొలగించడంతో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా శరీరంలో పొటాషియం స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి. ఇంతటి కీలకమైన కిడ్నీల పనితీరులో ఏ చిన్న సమస్య తలెత్తినా వాటిని తేలికగా తీసుకోకూడదు. ఐతే చాలా మంది కిడ్నీ వ్యాధులకు సంబంధించిన లక్షణాలు ముందే పసిగట్టినప్పటికీ అంత శ్రద్ధ వహించరు. సమస్య తొలినాళ్లలోనే జాగ్రత్త వహించకపోతే తీవ్రతరం అయ్యి, కిడ్నీల మార్పిడికి దారి తీస్తుంది. మూత్రపిండ వ్యాధులను మూత్రం ద్వారా సులభంగా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడం, మూత్రంలో రక్తం రావడం, మూత్రం రంగులో మార్పు కనిపించడం వంటివి కనిపిస్తే.. ఇవి కిడ్నీల వ్యాధి ప్రారంభ లక్షణాలుగా గుర్తించాలి. కొన్ని సందర్భాల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా దారి తీస్తుంది. ఇటువంటి సందర్భంలో వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు సకాలంలో చికిత్స అందకపోతే.. చాలా అవయవాలకు వ్యాపిస్తుంది.
కొన్నిసార్లు కిడ్నీ ఇన్ఫెక్షన్ తీవ్రతరమవుతుంది. ఇటువంటి సందర్భాల్లో కూడా మార్పిడి చేయవలసి వస్తుంది.అనేక మందికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. వీటి వల్ల కూడా కిడ్నీలకు చాలా నష్టం జరుగుతుంది. అందువల్ల మూత్రానికి సంబంధించిన ఏదైనా లక్షణం కనిపిస్తే విస్మరించకూడదు. మూత్రంలో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియా మూత్ర నాళం ద్వారా కిడ్నీకి చేరి, కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది.
మరో ముఖ్య లక్షణం ఏంటంటే.. పాదాలలో వాపు ఉండటం కూడా కిడ్నీల వ్యాధికి మరో సూచన. పాదాల్లో తరచూ వాపు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. డయాబెటిస్, గుండె సమస్యలున్న వారు కూడా కిడ్నీ వ్యాధులపై శ్రద్ధ వహించాలి. కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదం వీరిలో ఎక్కువగా ఉంటుంది.
కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. వైద్యుల సలహా లేకుండా ఏ వ్యాధికి మందులు వాడకూడదు. మందులు ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. రోజుకు కనీసం 4 లీటర్ల నీళ్లు తాగాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎల్లప్పుడు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి. మూత్రానికి సంబంధించిన ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు.