
ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా అసలు నిద్రపోవడానికి కూడా సమయం దొరకడం లేదు. త్వరగా నిద్ర కూడా రాదు. నిద్ర పోవడానికి ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం సమయం దొరికితే మాత్రం నిద్ర పోతూనే ఉంటారు. కొన్ని సెకన్లలోనే నిద్రలోకి జారుకుంటారు. కొందరు ఐదారు గంటలు నిద్రపోతే.. మరికొందరు మాత్రం 10, 11 గంటలు నిద్రపోయే వారు కూడా ఉంటారు. నిద్ర అనేది మనసుకు, శరీరానికి బూస్టర్‌లా పని చేస్తుంది. బాగా అలిసిపోయినా, మనసు బాగోలేక పోయినా.. ఒక్క స్లీమ్ వేస్తే అంతా సెట్ అవుతుంది. శరీరాన్ని, మనసును ఎనర్జిటిక్‌గా మార్చడంలో నిద్ర బాగా సహాయ పడుతుంది. అయితే తక్కువ సేపు పడుకుంటే ఎన్ని నష్టాలు ఉన్నాయో.. ఎక్కువ సేపు పడుకున్నా కూడా అంతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు పడుకోవడం వల్ల రక రకాల వ్యాధులు వస్తాయని అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
అతిగా నిద్రపోయే వారిలో ఒత్తిడి అనేది కూడా ఎక్కువగా పడుతుందని చెబుతున్నారు. తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారిలో 49 శాతం డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయట. ఎక్కువ సేపు నిద్రపోతే మెదడు పని తీరు దెబ్బ తింటుందని నిపుణులు అంటున్నారు.
ఎక్కువ సేపు నిద్రపోయే ఆడవారు.. గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. 650 మంది ఆడవారిపై నిర్వహించిన టెస్టుల్లో ఇది తేలింది. రోజుకు 7 లేదా 8 గంటలు నిద్రపోయే అవకాశం ఉన్న మహిళలు గర్భం ధరించే అవకాశం త్వరగా ఉందని, 9 లేదా 11 గంటలు నిద్రపోయే మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు.
నిద్ర తక్కువ అయినా డయాబెటీస్ ముప్పు తప్పదు. అలాగే ఎక్కువ అయినా కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు రెండు రెట్లు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పరిశోధనల ప్రకారం.. రాత్రి పూట 10 గంటలకు పైగా నిద్రపోయే వ్యక్తుల్లో గ్లూకోజ్ స్థాయిలపై ప్రభావం ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
రాత్రి పూట 7 లేదా 8 గంటల కంటే.. 10 గంటలకు పైగా నిద్రపోయే వారు.. అధిక బరువుతో ఉన్నట్టు కొనుగొనబడింది. 9 నుంచి 10 గంటలు నిద్రపోయే వారిలో.. ఆహార నియంత్రణ, వ్యాయామం చేసినప్పటికీ 25 శాతం బరువు పెరిగినట్టు నిపుణులు కనుగొన్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)