
ఒంటరి మహిళల జాబితాలో తమిళనాడు (11.6%) అగ్రస్థానంలో నిలవగా, కేరళ (10.4%), కర్ణాటక (8.6%) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పురుషులతో పోలిస్తే మహిళలు 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఒంటరి జీవితాన్ని ఎంచుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 8.0%, తెలంగాణలో 7.6% మంది మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ సంఖ్య పురుషులతో పోలిస్తే ఎంతో ఎక్కువ.
ఈ ధోరణి వెనుక సామాజిక, ఆర్థిక కారణాలు బలంగా ఉన్నాయి. మహిళల్లో పెరిగిన విద్యాశాతం, ఆర్థిక స్వాతంత్ర్యం ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడిన మహిళలు వైవాహిక జీవితంలో రాజీపడి జీవించేందుకు ఇష్టపడటం లేదు. అలాగే, పురుషుల్లో సగటు ఆయుర్దాయం తక్కువగా ఉండటం వల్ల, భర్తను కోల్పోయిన మహిళల సంఖ్య కూడా ఒక కారణంగా నిలుస్తోంది.
జనాభా సమతుల్యతకు టీఎఫ్‌ఆర్ (TFR) 2.1 ఉండాలి, కానీ దేశ సగటు 1.9 కి పడిపోయింది. ఏపీలో 1.4, తెలంగాణలో 1.5 రేటు నమోదు కావడం ఆందోళనకరమైన విషయం. ఢిల్లీ, తెలంగాణలో పల్లె కంటే నగరాల్లోనే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం మరో విశేషం.
బాల్య వివాహాల విషయానికి వస్తే, పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలు ఆలస్యంగా వివాహం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. జాతీయ సగటు వివాహ వయసు 23.1 ఏళ్లు కాగా, కేరళలో అది 24.5 ఏళ్లుగా నమోదైంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలు విద్య, కెరీర్‌కు ఇస్తున్న ప్రాధాన్యత, వారి జీవనశైలిలో వస్తున్న మార్పులే ఈ గణాంకాలకు ప్రధాన కారణం.
మహిళల సాధికారత పెరగడం ఒక శుభపరిణామమే అయినా, కుటుంబ వ్యవస్థలో వస్తున్న ఈ మార్పులు సమాజ నిర్మాణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి. మన దేశంలో మారుతున్న ఈ సామాజిక ముఖచిత్రం, భవిష్యత్తులో పాలసీల రూపకల్పనపై ఎంతో ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.