
ఆరోగ్యకరమైన జుట్టు అందాన్ని పెంచడమే కాదు మన వ్యక్తిత్వాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది. అందుకే అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ప్రతి ఒక్కరూ తమ జుట్టు గురించి ఆందోళన చెందుతారు. వేసవిలో అధిక చెమట కారణంగా జుట్టులో బాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. ఇది జుట్టు జిడ్డుగా మారడం.. తలలో చుండ్రుకు కారణమవుతుంది. అంతేకాదు వేడి నుంచి ఉపశమనం కోసం ఈ సమయంలో చాలా బిగుతుగా జడలు కట్టుకుంటారు. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. జుట్టు రాలడానికి కారణమవుతుంది. అంతే కాదు తీవ్రమైన సూర్యకాంతి వల్ల జుట్టు దెబ్బతింటుంది. జుట్టు చివరలు చిట్లడం వంటి సమస్యలు పెరుగుతాయి. జుట్టు బలహీనంగా మారి ఊడిపోవడం ప్రారంభమవుతుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం కొబ్బరి క్రీమ్ ని ఉపయోగించవచ్చు.
వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం ప్రయోజనకరంగా ఉంటాయి. దీనితో పాటు కొబ్బరి క్రీమ్ కూడా అనేక పోషకాలను ఇస్తుంది. కొబ్బరి క్రీమ్ జుట్టు సమస్యను తగ్గించడంతో పాటు జుట్టు రాలడాన్ని నివారించడం.. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. అయితే కొబ్బరి క్రీమ్ లో కొన్ని వస్తువులతో కలిపి అప్లై చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు లభిస్తాయి.
కొబ్బరి క్రీమ్, మెంతి గింజలు: ఒక గిన్నెలోకి కొబ్బరి క్రీమ్ వేసి దానిలో నానబెట్టిన మెంతులు వేయండి. ఇప్పుడు రెండింటినీ గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ ను తల చర్మం నుంచి జుట్టు చివరల వరకు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత 40 నిమిషాల నుంచి 1 గంట వరకు ఉంచండి. తర్వాత జుట్టును సాధారణ నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయండి. మీరు గొప్ప ఫలితాలను పొందుతారు.
ఉసిరి -కొబ్బరి క్రీమ్: మీ జుట్టును రిపేర్ చేయడంతో పాటు ఒత్తుగా మారాలనుకుంటే.. కొబ్బరి క్రీమ్ లో ఉసిరి పొడిని కలిపి వాడండి. ఈ రెండిటిని కలిపిన ఈ పేస్ట్ ని జుట్టు చివరల వరకు బాగా అప్లై చేయండి. 1 గంట తర్వాత జుట్టుని శుభ్రం చేసుకోండి. ఈ చిట్కాను వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయండి.
గుడ్డు – కొబ్బరి క్రీమ్: గుడ్డును కొబ్బరి క్రీమ్‌తో కలిపి జుట్టుకి అప్లై చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి ఆపై అప్లై చేయండి. ఈ రెమెడీని వారానికి ఒకటి లేదా రెండుసార్లు పునరావృతం చేయడం ద్వారా జుట్టు చిట్లడం ఆగుతుంది. అంతేకాదు జుట్టు సిల్కీగా.. మెరుస్తూ ఉంటుంది.
కొబ్బరి క్రీమ్- అలోవెరా: జుట్టుని సిల్కీ-మెరిసేలా చేయడానికి కొబ్బరి క్రీమ్ ఒక గొప్ప వరం. కొబ్బరి క్రీమ్ లో కలబంద పేస్ట్ ని కలిపి అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది. అలోవేరా లోని హైడ్రేటింగ్ లక్షణాలు జుట్టును మృదువుగా చేస్తాయి. ఈ రెండు పదార్థాలను తాజాగా తీసుకొని.. బాగా రుబ్బుకుని పేస్ట్ లా చేసి జుట్టుకు అప్లై చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)