Banana Peels Chutney: అరటి తొక్కలతో అదిరిపోయే చట్నీ.. ఇలా చేశారంటే మీ ఫ్యామిలీ ఫిదా!

How to make Banana Peels Chutney: అరటిపండు తొక్కను మనలో దాదాపు అందరూ పడేస్తుంటారు. అరటి తొక్కతో ఏం ఉపయోగం ఉందిలే అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఈ అరటి తొక్కలను ఉపయోగించి అద్భుతమైన రుచిగల చట్నీని తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా?

Banana Peels Chutney: అరటి తొక్కలతో అదిరిపోయే చట్నీ.. ఇలా చేశారంటే మీ ఫ్యామిలీ ఫిదా!
Delicious Banana Peels Chutney
Image Credit source: AI Image

Updated on: Apr 24, 2026 | 1:11 PM

చాలా మంది అరటిపండు తిన్న తర్వాత తొక్కను చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ ఇలా నిర్లక్ష్యంగా పడేసే అరటి తొక్కతో రుచికరమైన వంటకం తయారు చేయవచ్చని మీకు తెలుసా? అవును.. అరటి తొక్కలు కేవలం వ్యర్థం కాదు. అవి పోషకాల గని. శరీరంలోని విటమిన్ లోపాలను తీర్చడంలో అరటి తొక్కలలోని పదార్థాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఇకపై ఈ పోషకమైన తొక్కలను చెత్తబుట్టలో పడేసే ముందు కాస్త ఆలోచించండి..

అరటి తొక్కల చట్నీఎలా తయారు చేయాలంటే?

ఈ చట్నీ తయారు చేయడం అంత కష్టమేమీ కాదు. దీనికి కావలసినవి.. ఉడికించిన అరటి తొక్క, ఆవ నూనె, నల్ల జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, అల్లం, కొద్దిగా కారం. పుల్లని రుచి కోసం నిమ్మరసం లేదా మామిడి ముక్కలను కూడా కలుపుకోవచ్చు. ముందుగా అరటి తొక్కలను బాగా కడగాలి. తరువాత వాటిని కొద్ది నీటిలో ఉప్పు వేసి మెత్తబడే వరకు ఉడకబెట్టాలి. మరో బాణలిలో వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలను తక్కువ మంట మీద వేయించాలి. దీనివల్ల పచ్చి వాసన పోయి మంచి సువాసన వస్తుంది.

ఇప్పుడు ఉడికించిన తొక్కను, వేయించిన మసాలాలను ఒక మిక్సర్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. రుచికి కొద్దిగా నీళ్లు, ఉప్పు కలపండి. అన్నింటినీ కలిపి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమం మరీ పల్చగా లేకుండా చూసుకోవాలి. చట్నీ రుచిని పెంచడానికి.. పోపు వేసుకోవాలి. ఒక చిన్న పాత్రలో ఆవనూనె వేడి చేసి, అందులో నల్ల జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసుకుని వేయించాలి. తర్వాత ఆ మసాలా మిశ్రమాన్ని చట్నీ మీద పోసుకోవాలి. దీంతో కమ్మని వాసన వస్తుంది. అరటి తొక్కలలో పీచుపదార్థం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడే వారికి ఈ అరటి చట్నీ భలేగా నచ్చుతుంది. ఈ చట్నీని వేడి అన్నం, పరాఠా, సాదా రోటీతో కలిపి తీసుకుంటే భలే రుచిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us