Smart phone: పురుషుల్లో సంతాన సమస్యలకు.. స్మార్ట్‌ఫోన్‌ కారణమవుతుందా.?

|

Dec 03, 2024 | 6:51 PM

స్మార్ట్‌ ఫోన్‌ లేనిది రోజు గడవని పరిస్థితి ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ ఆరోగ్యంపై మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో సంతానలేమి సమస్యకు స్మార్ట్‌ ఫోన్‌ కారణమవుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది..

Smart phone: పురుషుల్లో సంతాన సమస్యలకు.. స్మార్ట్‌ఫోన్‌ కారణమవుతుందా.?
Smartphone Side Effects
Follow us on

ప్రస్తుతం స్మార్టఫోన్‌ వినియోగం భారీగా పెరిగింది. చేతిలో ఫోన్‌ లేకపోతే రోజు గడిచే పనిలేదు. అన్ని అవసరాలకు అనివార్యంగా మారిన స్మార్ట్‌ ఫోన్‌తో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని నిపుణులు చెబుతూనే ఉన్నారు. మితిమీరి స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగిస్తే మానసిక సమస్యలు మొదలు ఎన్నో శారీరక సమస్యలు తప్పవని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్మార్ట్‌ ఫోన్‌ అధికంగా ఉపయోగించడం వల్ల పురుషుల్లో సమస్యలు తప్పవని చెబుతున్నారు.

ముఖ్యంగా పురుషుల్లో స్పెర్మ్‌ కౌంట్‌పై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక ఫోన్ వినియోగం సంతానోత్పత్తికి ప్రమాదకరం అని తేలింది. పరిశోధనల్లో భాగంగా స్విట్జర్లాండ్‌కు చెందిన పురుషులపై నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. స్మార్ట్‌ ఫోన్‌లను అధికంగా ఉపయోగించే పురుషుల్లో స్పెర్మ్‌ కౌంట్ తగ్గే అవకాశం ఉందని తేలింది. రోజుకు 20 సార్ల కంటే ఎక్కువ ఫోన్‌ను ఉపయోగించే పురుషల్లో స్పెర్మ్‌ కౌంట్‌ 22శాతం, స్పెర్మ్‌ నాణ్యత 21 శాతం తగ్గిందని పరిశోధనల్లో వెల్లడైంది.

అలాగే దీర్ఘకాలంగా మొబైల్ ఫోన్‌ ఉపయోగించే వారిలో శుక్రకణాల మూవ్‌మెంట్ కూడా తగ్గిందని పరిశోధనల్లో వెల్లడైంది. మొబైల్ ఫోన్ రేడియేషన్‌కు ఎక్కువసేపు గురికావడం వల్ల స్పెర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్‌కు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే స్మార్ట్‌ ఫోన్‌తో పాటు మరికొన్ని అంశాలు కూడా స్పెర్మ్‌ కౌంట్ తగ్గడానికి కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు.

కాలుష్యం కూడా స్పెర్మ్‌ కౌంట్ తగ్గడానికి కారణమవుతుందని అంటున్నారు. స్మోకింగ్, మద్యం సేవించే వారిలో కూడా స్పెర్మ్‌ కౌంట్‌పై ప్రభావం పడుతుందని పరిశోధనల్లో తేలింది. ఊబకాయం కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో శుక్రకణాల నాణ్యత మెరుగుపడాలంటే తీసుకునే ఆహారంతో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామంతో పాటు యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..