మీ పిల్లలు రోజంతా ఫోన్ చూస్తున్నారా..? వారి భవిష్యత్తు బాగుండాలంటే ఇలా చేయండి

నేటి డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు ఫోన్లపై అధికంగా ఆధారపడుతున్నారు. ఉదయం లేవగానే ఫోన్‌ చూస్తూ రోజంతా మొబైల్‌లో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది వారి అభ్యాసంపై, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కొన్ని మార్గాలను పాటిస్తే పిల్లల భవిష్యత్తు మారుతుంది.

మీ పిల్లలు రోజంతా ఫోన్ చూస్తున్నారా..? వారి భవిష్యత్తు బాగుండాలంటే ఇలా చేయండి
Kids Screen Time

Updated on: May 06, 2025 | 2:18 PM

మీ పిల్లలు రోజంతా ఫోన్ చూస్తూ.. బయటకు వెళ్లడం మరిచిపోతున్నారా..? అయితే ఆందోళనపడకండి. ఈ చిన్న మార్పులు మీకు పెద్ద ఉపయోగం చేస్తాయి. ఈ మార్గాలను పాటిస్తే మీ పిల్లలు మళ్లీ నిజమైన ప్రపంచంలోకి వస్తారు. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారు. స్కూల్‌కు వెళ్లే ముందు, స్కూల్‌ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత, అల్పాహారం తీసుకునేటప్పుడూ ఫోన్ చేతిలో ఉంటుంది. అలా వాళ్లు తలెత్తకుండా మొబైల్ చూస్తూ ఉండిపోతారు.

తల్లిదండ్రులు ఉద్యోగాలతో బిజీగా ఉండటంతో పిల్లలు ఎంతసేపు ఫోన్ చూస్తున్నారో పట్టించుకోరు. కానీ ఆ అలవాటు వ్యసనంగా మారిన తర్వాత పిల్లలు చదువుపై ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

మీరు ఫోన్ ఎక్కువగా వాడుతున్నప్పుడు మీ పిల్లలు కూడా అదే చేస్తారు. మీరు ఆహారం తినేటప్పుడు, బంధువులతో మాట్లాడేటప్పుడు ఫోన్ దూరంగా పెట్టాలి. మిమ్మల్ని నేరుగా చూసే పిల్లలు మీ అలవాట్లను వెంటనే అనుసరిస్తారు. అందుకే ముందు మీరు మారాలి. అలా అయితేనే పిల్లల అభిరుచిలో మార్పు వస్తుంది.

పిల్లలకు మొబైల్ ఇవ్వాలంటే ఒక నిర్ణీత సమయం కావాలి. ఉదాహరణకు రోజుకు ఒక గంట అని చెప్పండి. ఆ సమయంలో మాత్రమే ఫోన్ వాడే అవకాశం ఇవ్వాలి. అప్పుడు ఫోన్ అన్నదే ఒక పరిమితమైన విషయం అని వాళ్లు అర్థం చేసుకుంటారు.

పిల్లల్ని ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే వాళ్లకు ఇతర చక్కటి పనులు చెప్పాలి. కథా పుస్తకాలు, చిత్రాలు వేసే పని ఇవ్వండి. పార్క్‌కి తీసుకెళ్లండి. గీతోపదేశం, నాటకాలు, క్రీడలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడండి. అలా చేయడం వల్ల వాళ్లు ఫోన్ వాడకుండానే సంతోషంగా ఉండడం నేర్చుకుంటారు.

ఫోన్‌ వాడకాన్ని పిల్లలు మితంగా చేయాలంటే.. అదే ఫోన్‌ను ఉపయోగించి నియంత్రణ సాధించొచ్చు. ఇందుకోసం టైమ్‌ లిమిట్‌ పెట్టే యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేయండి. తల్లిదండ్రుల పర్యవేక్షణ సెట్టింగ్స్‌ను ఆన్‌ చేయండి. ఇలా చేస్తే వారు అనవసరంగా ఎక్కువసేపు ఫోన్‌ ఉపయోగించలేరు. మీరు నియంత్రించే విధంగా మాత్రమే ఫోన్‌ను వాడతారు.

పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడుతున్నారని తిట్టకండి. అలా చేస్తే మొండిగా మారుతారు. ప్రేమగా, ఓపికగా ఫోన్ వాడకం వల్ల ఏ సమస్యలు వస్తాయో వివరించండి. ఫోన్ ఎలా ఉపయోగించాలో బోధించండి. అప్పుడు వారు కూడా మీ సూచనలను పాటిస్తారు.

స్మార్ట్‌ఫోన్ అనేది పూర్తిగా తప్పించలేం. కానీ దాన్ని ఎలా ఎంతసేపు వాడాలో నేర్పించాలి. తల్లిదండ్రులుగా మీరు మారితే పిల్లలపై కూడా మంచి ప్రభావం చూపించవచ్చు. ప్రేమ, ఓపిక, చక్కటి మార్గనిర్దేశం ద్వారా ఫోన్ బానిసత్వం నుంచి పిల్లలను బయటకు తీసుకురావచ్చు.