Air Cooler Guide: కొత్త కూలర్ కొంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే మీ డబ్బులు బూడిదలో పోసిన పన్నీరే!

భానుడి భగభగలకు తట్టుకోలేక ఇళ్లలో కూలర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏసీ కొనే బడ్జెట్ లేని వారికి ఎయిర్ కూలర్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. అయితే, కొత్త కూలర్ కొనేటప్పుడు కేవలం ధర, లుక్స్ మాత్రమే చూస్తే సరిపోదు. రూమ్ సైజ్ ఎంత? ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉండాలి? ఏ రకమైన కూలింగ్ ప్యాడ్లు బెస్ట్? అనే చిట్కాలు తెలిస్తే మీ డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఇల్లంతా కాశ్మీర్ లాగా చల్లబడిపోతుంది. ఆ స్మార్ట్ బయింగ్ గైడ్ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

Air Cooler Guide: కొత్త కూలర్ కొంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే మీ డబ్బులు బూడిదలో పోసిన పన్నీరే!
Air Cooler Buying Tips

Updated on: May 16, 2026 | 3:51 PM

కూలర్ ఆన్ చేస్తే వచ్చే శబ్దం వల్ల రాత్రిపూట నిద్ర కరువవుతోందా? పదే పదే నీళ్లు పోయలేక విసుగొస్తోందా? ఇలాంటి సమస్యలన్నింటికీ కొనేముందే చెక్ పెట్టవచ్చు. ఇన్వర్టర్ కూలర్ల ప్రాధాన్యత ఏంటి, హనీకోంబ్ ప్యాడ్ల వల్ల వచ్చే లాభాలేంటో నిపుణులు వివరిస్తున్నారు. ఈ వేసవిలో మీరు కొత్త ఎయిర్ కూలర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ జేబుకు చిల్లు పడకుండా బెస్ట్ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. గది పరిమాణాన్ని బట్టి ఎంపిక
చిన్న పడకగదులకు లేదా స్టడీ రూమ్స్‌కి పర్సనల్ లేదా టవర్ కూలర్లు సరిపోతాయి. అదే పెద్ద హాల్ లేదా ఎక్కువ మంది ఉండే గదులకైతే డెజర్ట్ కూలర్లు మాత్రమే సరైన శీతలీకరణను అందిస్తాయి. కొనేటప్పుడు కూలర్ యొక్క ‘ఎయిర్ త్రో’ (గాలిని విసిరే దూరం) సామర్థ్యాన్ని తప్పక అడగండి.

2. వాటర్ ట్యాంక్ కెపాసిటీ
రాత్రంతా కూలర్ నిరంతరాయంగా పనిచేయాలంటే ట్యాంక్ సామర్థ్యం ఎక్కువగా ఉండాలి. చిన్న అవసరాలకు 20-30 లీటర్లు సరిపోతుంది. కానీ, రాత్రి పదే పదే లేచి నీళ్లు నింపే శ్రమ తప్పాలంటే పెద్ద గదుల కోసం 40 లీటర్ల కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న మోడళ్లను ఎంచుకోండి. వీలైతే ‘ఆటో వాటర్ ఫిల్’ ఫీచర్ ఉన్నది తీసుకుంటే పైపు కనెక్ట్ చేయగానే అదే వాటర్ నింపుకుంటుంది.

3. హనీకోంబ్ కూలింగ్ ప్యాడ్లు
పాతకాలపు గడ్డి ప్యాడ్ల కంటే ప్రస్తుతం వస్తున్న ‘హనీకోంబ్ ప్యాడ్లు’ అత్యంత ఉత్తమమైనవి. ఇవి ఎక్కువ సేపు నీటిని నిల్వ ఉంచుకుని, గదిని త్వరగా చల్లబరుస్తాయి. పైగా ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి, త్వరగా పాడవువు.

4. పవర్ సేవింగ్ & ఇన్వర్టర్ సపోర్ట్:
పెద్ద మోటార్ ఉన్న కూలర్లు ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. కాబట్టి ఎనర్జీ ఎఫిషియంట్ మోడళ్లను ఎంచుకోండి. ముఖ్యంగా కరెంట్ కోతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల వారు ‘ఇన్వర్టర్ ఎయిర్ కూలర్’ తీసుకుంటే, ఇంట్లోని నార్మల్ ఇన్వర్టర్ బ్యాటరీపై కూడా ఇది సులభంగా రన్ అవుతుంది.

5. నాయిస్ లెవెల్స్ & బాడీ క్వాలిటీ:
కొన్ని కూలర్లు ఆన్ చేస్తే జెట్ విమానం లాగా శబ్దం వస్తుంది, దీనివల్ల నిద్ర చెడిపోతుంది. అందుకే ‘సైలెంట్ ఆపరేషన్’ లేదా తక్కువ డెసిబెల్ (dB) శబ్దం చేసే కూలర్లను అడగండి. అలాగే సులభంగా జరపడానికి వీలుగా కింద చక్రాలు, దూరం నుంచి ఆపరేట్ చేయడానికి రిమోట్ కంట్రోల్, టైమర్ ఉన్న మోడళ్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

Follow Us