Pigeon Droppings: మెష్, నెట్స్ అవసరం లేదు.. ఈ టిప్స్ తో పావురాలను రాకుండా చేయొచ్చు

నగరాల్లో నివసించే చాలామందికి పక్షులు, ముఖ్యంగా పావురాలు పెద్ద తలనొప్పిగా మారుతాయి. పావురాలు ఇళ్లలోని వెంటిలేషన్స్‌, బాల్కనీల్లో గూడు పెడతాయి. ఎక్కడపడితే అక్కడ రెట్టలు వేస్తాయి. రైలింగ్స్‌, ఫ్లోరింగ్స్‌పై అవి వేసే రెట్టల వల్ల బాల్కనీ అంతా మురికిగా మారి కంపు కొడుతుంది. ఈ రెట్టల కారణంగా వైరస్‌లు, ఇన్ఫెక్షన్లు రావచ్చు. మెదడు, ఊపిరితిత్తుల (ఆస్తమా) వ్యాధుల ముప్పు, ఫుడ్ పాయిజనింగ్, సమస్యలు కూడా పెరుగుతాయి.

Pigeon Droppings: మెష్, నెట్స్ అవసరం లేదు.. ఈ టిప్స్ తో పావురాలను రాకుండా చేయొచ్చు
Pigeons Tips

Edited By:

Updated on: Feb 20, 2025 | 8:43 AM

పావురాలను చూడ్డానికి ఎంతో మంది ఇష్టపడతారు. కానీ వీటి వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. వీటి రెక్కలు ముక్కుద్వారా ఊపిరితిత్తుల్లో చేరి ప్రాణాలు తీసేయగలవు. అంతేకాదు పావురాల మల విసర్జనలో ఆమ్లం ఉండటం వల్ల అవి ఇనుము లేదా పెయింట్ ఉన్న వస్తువులపై మొండి మరకలు ఏర్పడతాయి. అయితే కొన్ని టిప్స్‌తో పావురాలు బాల్కనీలోకి రాకుండా ఆపవచ్చు. బాల్కనీని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. పావురాలు లోపలికి రాకుండా అన్ని ఎంట్రీ పాయింట్స్ క్లోజ్ చేయాలి. బాల్కనీ గ్రిల్‌కు కొందరు నెట్స్ లాంటి అటాచ్ చేస్తూ ఉంటారు. అయితే, మెష్, నెట్స్ వాడకుండానే పావురాలను లోపలికి రాకుండా ఆపొచ్చు. అదెలాగో తెలుసుకోండి..

మిరియాలతో పావురాలకు చెక్..

పావురాలు కొన్ని ఘాటైన వాసనలను భరించలేవు. కాబట్టి వీటిని ఇంటి పై కప్పులు, బాల్కనీలో వచ్చి చేరకుండా ఈ టిప్ ను పాటించండి. అవి వచ్చి చేరే దగ్గర మిరియాల పొడిని చల్లి చూడండి. ఈ వాసనకు పావురాలు రాకుండా ఉంటాయి. అలాగే ఆ ప్రాంతంలో పుదీనా ఆయిల్‌ లేదా దాల్చిన చెక్క కలిపి నీటిని స్ప్రే చేస్తే కూడా పక్షులు దూరంగా ఉంటాయి.

వీటిని వేలాడదీయండి..

చైనీయులు ఎక్కువగా నమ్మే విండ్ చైమ్స్ ను వాస్తు దోషాలు లక్ కోసమే కాదు ఇలా కూడా ఉపయోగించవచ్చు. విండ్ చైమ్స్ ను పావురాలు వచ్చే దగ్గర వేలాడదీయండి. గాలి వీచినప్పుడల్లా వీటి నుంచి వచ్చే శబ్దాలకు అవి భయపడి వెళ్లిపోతాయి. ఇవి ఇంకా మంచిగా పనిచేయాలంటే అద్దాలతో ఉన్న వాటిని ఎంచుకోండి.

పక్షి బొమ్మలు పెట్టండి..

బాల్కనీల్లో పెద్దగా కనిపించే పక్షి బొమ్మలను వేలాడదీయండి. తమ కన్నా ఆకారంలో పెద్దగా ఉన్న పక్షులను చూస్తే పావురాలు భయపడతాయి. అంతేకాదు ఇవి బాల్కనీలో అందంగా కూడా కనపడతాయి.

పాత సీడీలు..

అక్కరకు లేని, వాడకంలో లేని పాత సీడీలను బాల్కనీల్లో వేలాడదీయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వాటి రిఫ్లెక్షన్ కు పక్షులు బెదిరిపోతాయి. దీంతో మళ్లీ రావడం కూడా తగ్గించేస్తాయి.

జిప్ టైలు బిగించండి..

బాల్కనీ అంచుల్లో జిప్ టైలను బిగించండి. వాటి అంచులను షార్ప్ గా కట్ చేసేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల పక్షులు వాటిపై వాలకుండా ఉంటాయి. ఇవి వాటికి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

పక్షి గూళ్లు జాగ్రత్త..

పావురాలను తొలగించే క్రమంలో పక్షి గూళ్లు కనిపిస్తే వాటితో సున్నితంగా వ్యవహరించండి. వాటిని మరో సురక్షిత ప్రాంతానికి తరలించేలా జాగ్రత్తలు తీసుకోండి.