
వాస్తు శాస్త్రం ప్రకారం.. శ్రావణంలో కొన్ని విశిష్టమైన మొక్కలను ఇంటి పరిసరాల్లో నాటడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఇవి శివుని అనుగ్రహాన్ని ఆకర్షించడమే కాకుండా ఇంట్లో శాంతిని, ఐశ్వర్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని నింపుతాయి. ఇక అలాంటి 5 పవిత్రమైన మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శైవ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించే వృక్షాలలో బిల్వవృక్షం అగ్రస్థానంలో ఉంటుంది. ఈ వృక్షం నుండి లభించే బిల్వదళంను శివుడికి సమర్పించడం అపార పుణ్యఫలాన్ని ఇస్తుంది. వాస్తు ప్రకారం ఈ వృక్షాన్ని ఇంటి ఆవరణలో నాటితే.. దారిద్య్రం తొలగిపోయి.. సౌఖ్యం, సమృద్ధి కలుగుతాయని విశ్వాసం. శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ బిల్వపత్రం.
తులసిని అత్యంత పూజనీయమైన మొక్కగా భావిస్తారు. సాధారణంగా శివుడికి తులసిని సమర్పించరు కానీ.. ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది. శ్రావణంలో తులసిని నాటి ప్రతిరోజూ దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ధనసంపత్తి వస్తుందని నమ్మకం. ఇది గాలి నాణ్యతను మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతుంది. తులసి సాక్షిగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
శమీ మొక్కను శని దేవుడు, శివుడు ఇద్దరికీ ప్రీతికరంగా భావిస్తారు. శ్రావణంలో ఈ మొక్కను నాటడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆధ్యాత్మిక రక్షణ లభిస్తుందని విశ్వాసం. ఈ మొక్కను పూజించడం వల్ల శాంతి, కర్మ పరిష్కరణ జరుగుతుందని చెబుతారు. శని దోష నివారణకు.. శివ అనుగ్రహానికి శమీ వృక్షం దివ్యమైనది.
శివుడితో అనుబంధం ఉన్న మరో ముఖ్యమైన మొక్క తెల్ల జిల్లేడు. ముఖ్యంగా తెల్ల పువ్వుల రకం అత్యంత పవిత్రంగా భావిస్తారు. తెల్ల జిల్లేడు పువ్వులను శివలింగానికి సమర్పించడం శుభ సూచకంగా భావించి.. కోరికలు నెరవేరే అవకాశముందని నమ్మకం. శ్రావణ సమయంలో తెల్ల జిల్లేడు మొక్కను ఇంట్లో నాటితే విజయం, ధనం, దైవ అనుగ్రహం కలుగుతాయంటారు. జిల్లేడు పూలతో శివుని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి.
తీక్షణంగా కనిపించే ధతూరా మొక్క శివునికి అత్యంత ప్రీతికరమైనది. దాని పూలు, పండ్లు శివలింగానికి సమర్పించడం అత్యంత పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. ఇంట్లో ధతూరా మొక్కను నాటడం వల్ల దురదృష్టం తొలగిపోయి.. శత్రువుల మీద విజయం, సంపదలో వృద్ధి జరుగుతుందని నమ్మకం. ధతూరా శివయ్యకు అర్పించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.
వర్షాకాలంలో భూమి భక్తికి వేదికగా మారుతుంది. ఈ సమయంలో పవిత్రమైన మొక్కలను నాటడం ఒక విధంగా భగవంతుడితో మన అనుబంధాన్ని దృఢం చేయడమే.