Soap Hacks: మిగిలిన సబ్బు ముక్కలు పడేస్తున్నారా.. హే ఆగండి.. వాటిని ఎలా ఉపయోగించాలంటే..
సబ్బులను ఉపయోగించడం ప్రతి ఒక్కరి ఇంట్లో సర్వసాధారణం. అయితే సబ్బు అరిగిపోయి.. చివరకు చిన్న ముక్కగా మారిపోయిన తర్వాత వాటిని ఉపయోగించడం కష్టం. దీంతో ఆ చిన్న చిన్న సబ్బు ముక్కలను బయట పడేస్తారు. అయితే కొంచెం ఓపిక, తెలివి తేటలను ఉపయోగిస్తే పనికి రాని వస్తువు అంటూ ఏదీ ఉండదు. ఇలా మిగిలిపోయిన సబ్బు ముక్కలను ఇంటికి మంచి వాసనను తీసుకుని వచ్చే విధంగా మంచి సువాసన స్ప్రే తయారు చేయవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఈ రోజు తెలుసుకుందాం..

వంటగదిలో అయినా బాత్రూంలో అయినా మనందరి ఇళ్లలో ఉపయోగించే సబ్బులు చిన్న చిన్నగా మిగిలిపోతూ తరచుగా మిగిలిపోతాయి. అవి చాలా చిన్నవిగా ఉండడంతో చేతిలోకి తీసుకుంటే చేతి నుంచి జారిపడిపోతాయి. అలాగే వాటిని ఉపయోగించడం కష్టంగా భావించి ఇక పనికిరానివిగా భావించి బయట పారేస్తాము. అయితే ఇలా చేయడం వలన ప్రతి నెలా ఎంత సబ్బు వృధా అవుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా. ఇది డబ్బు వృధా మాత్రమే కాదు.. మనం తెలిసి లేదా తెలియక ఉపయోగకరమైన వస్తువును కూడా చెత్తగా పరిగణిస్తాం. మిగిలిపోయిన సబ్బు ముక్కలను చెత్త కుప్పలో తొందరపడి విసిరేసే బదులు కొన్ని పద్ధతులను ఉపయోగించి కొన్ని పనులు చేయడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు. దీనితో పాటు అవి మీ దైనందిన జీవితాన్ని కూడా సులభతరం చేస్తాయి.
ఈ పనికిరాని వస్తువుతో మీ ఇంటి మూలలను తాజాదనంతో నింపవచ్చు. ఈ చిన్న సబ్బు ముక్కలు శుభ్రపరచడానికి మాత్రమే కాదు ఇంటిని మంచి వాసన వచ్చేలా చేయడానికి, బట్టలు తాజాగా ఉంచడానికి, కొన్ని ప్రత్యేకమైన గృహ నివారణలకు కూడా ఉపయోగపడతాయి. వీటి సహాయంతో ఖరీదైన ఎయిర్ ఫ్రెషనర్లు లేదా ఇతర సువాసనగల ఉత్పత్తులపై ఖర్చు చేసే డబ్బును ఆదా చేయవచ్చు. సబ్బు ముక్కలను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.
బట్టలు తాజాగా ఉంచడానికి మిగిలిన సబ్బు ముక్కలను ఒక సన్నని గుడ్డలో వేసి అల్మారాల్లో, డ్రాయర్లలో లేదా బట్టల మధ్య ఉంచండి. ఇది తేమ లేదా అధిక వేడి కారణంగా బట్టల నుంచి వచ్చే వాసనను నిరోధిస్తుంది. ఈ టిప్ తో మీ బట్టలు ఎప్పుడూ తేమ చెడు వాసన లేకుండా సువాసనతో ఉంటాయి.
బూట్ల వాసనను వదిలించుకోండి. వేసవిలో బూట్ల లోపల నుంచి దుర్వాసన వస్తుంది. కొన్నిసార్లు ఒక రోజు ముందు ఉతికి శుభ్రం చేసిన బూట్లు కూడా నెలల తరబడి శుభ్రం చేయనట్లు వాసన వస్తాయి. మీ బూట్లు కూడా ఇలాగే వాసన వస్తే, రాత్రంతా బూట్ల లోపల ఒక చిన్న సబ్బు ముక్క ఉంచండి. బూట్ల నుంచి సబ్బు తేమ, వాసన రెండింటినీ గ్రహిస్తుంది. దీని కారణంగా ఉదయం బూట్లు తాజాగా , సువాసనగా కనిపిస్తాయి.
బాత్రూమ్ తాజాదనం కోసం ఎలా ఉపయోగించాలంటే బాత్రూమ్ రోజంతా శుభ్రం చేసిన తర్వాత కూడా దుర్వాసన వస్తుంటే సబ్బు ముక్కలను ఉపయోగించవచ్చు. దీని కోసం సబ్బు ముక్కలను ఒక చిన్న గిన్నెలో లేదా మెష్ పౌచ్‌లో వేసి బాత్రూమ్ మూలలో ఉంచండి. మీరు దీనిని కమోడ్ వెనుక లేదా సింక్ దగ్గర కూడా ఉంచవచ్చు. ఈ సబ్బుకి నీరు తగిలినప్పుడల్లా సబ్బుముక్క నుంచి వచ్చే సువాసన వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. బాత్రూమ్ ఎల్లప్పుడూ మంచి వాసనతో ఉంటుంది.
రూమ్ ఫెర్మేషన్ స్ప్రేను ఎలా తయారు చేయాలంటే ముందుగా సబ్బు ముక్కలను తురుముకోవాలి. ఒక పాత్రలో 2 కప్పుల వేడి నీటిని తీసుకుని.. తురిమిన సబ్బును వేసి.. అది పూర్తిగా కరిగి మృదువైన ద్రావణం ఏర్పడే వరకు తక్కువ మంట వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లబరచండి. చల్లబడిన తర్వాత ఈ ద్రావణాన్ని ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్‌లో నింపి, మీకు నచ్చిన కొన్ని చుక్కల నూనెను జోడించండి. దీంతో ఇప్పుడు మీ ఇంట్లో తయారుచేసిన సువాసన స్ప్రే సిద్ధంగా ఉంది.
బట్టలు కత్తిరించే మార్కర్ గా బ్లౌజ్, సల్వార్ సూట్ లేదా కుర్తీ ఇలా వేటినైనా కుట్టుకోవాలని భావించి బట్టని కత్తిరించినప్పుడు.. మార్కింగ్ కోసం సుద్ద అవసరం. అలాంటి పరిస్థితిలో మార్కింగ్ చాక్ ఫీస్ ను కొనడానికి బదులుగా.. మీ ఇంట్లో మిగిలిపోయిన సబ్బు ముక్కను సుద్దగా ఉపయోగించవచ్చు.,
తలుపుల శబ్దాన్ని తగ్గించండి. తలుపుల నుంచి వచ్చే శబ్దాన్ని తగ్గించడానికి.. సబ్బు ముక్కలను ఉపయోగించవచ్చు. దీని కోసం దానిని పొడిగా చేసి, ఈ పొడిలో కొంచెం నీరు కలిపి ద్రావణంగా తయారు చేసి.. బ్రష్ సహాయంతో తలుపుల కీళ్ళకు అప్లై చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








