Peanuts: పచ్చి పల్లీలు వర్సెస్ వేయించిన పల్లీలు.. ఏవి తినడం బెస్ట్.. ఎవరికి ఏవి మంచివి!
పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరానికి బలాన్ని, శక్తిని అందించే అద్భుతమైన ఆహారం. అందుకే వీటిని పేదవాడి బాదం అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి చాలా తక్కువ ధరకే లభించే అద్భుతమైన పోషకాలు కలిగిన ఆహారం. అయితే పల్లీలను జనాలు రకరకాలు ఆహారంలో చేర్చుకుంటారు. కొందరు నాబెట్టి తింటే మరి కొందరు వెయించుకొని తింటారు. మరి కొందరు నేరుగా తింటారు. ఈ క్రమంలో పచ్చివి లేదా వెయించిన పల్లీలు రెండింటిలో ఏది ఉత్తమం అనేది చాలా మందిలో ఉన్న డౌట్.. దాన్ని ఇప్పుడు మనం క్లియర్ చేసుకుందాం.

ఎక్కువ డబ్బులు పెట్టి బాధం, కాజు కొనలేని వారికి పల్లీలే ఉత్తమం. ఎందుకంటే పల్లీలు పోషకాల గని. 100 గ్రాముల పల్లీలలో దాదాపు 567 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇది కోడి మాంసం, మేక మాంసం కంటే ఐదు రెట్లు ఎక్కువ బలాన్నిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు, 100 గ్రాముల పల్లీలలో 25 శాతం ప్రోటీన్, అంటే 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ బి3 పల్లీలలో సమృద్ధిగా లభించే ముఖ్యమైన విటమిన్లలో ఒకటి. ఈ పోషకాలు మన శరీరాన్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే పల్లీలు తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతారు. అయితే సాధారణంగా జనాలు మూడు రకాలుగా పల్లీలను ఆహారంలో చేర్చుకుంటారు.
పల్లీల వినియోగంలో మూడు రూపాలు
పచ్చి పల్లీలు: పచ్చి పల్లీకాయలు సులభంగా జీర్ణమయ్యే రూపం. ఇవి మార్కెట్‌లో ఏడాది పొడవునా అందుబాటులో ఉంటున్నాయి. జీర్ణశక్తి మందంగా ఉన్నవారికి, అంటే తిన్నది అరగక, ఒంటికి పట్టని వారికి, వృద్ధులకు, ఇంకా దంతాలు రాని చిన్నపిల్లలకు పచ్చి పల్లీలు చాలా మంచిది. బరువు పెరగాలనుకునేవారు, కండలు పెంచాలనుకునేవారు, శారీరక శ్రమ ఎక్కువ చేసేవారు , ఆటలాడే పిల్లలు, బాడీబిల్డింగ్, జిమ్ వ్యాయామాలు చేసేవారు, గర్భిణులు, బాలింతలు పచ్చి పల్లీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి బలం, శక్తి లభిస్తాయి. పచ్చి పల్లీలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎండు పల్లీలతో పోలిస్తే దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా తీసుకోవాలి.
నానబెట్టిన పల్లీలు: పచ్చి పల్లీలు దొరకనప్పుడు, ఎండు పల్లీలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినవచ్చు. ఈ నానబెట్టిన పల్లీలు కూడా పచ్చి పల్లీల వలె సులభంగా జీర్ణమవుతాయి. నానబెట్టడం వల్ల ఎండు పల్లీలలోని నూనె ప్రభావం తగ్గి, పాలు వంటి రూపానికి మారినట్లు అనిపిస్తుంది. అయితే, పచ్చి పల్లీల వలె వాసన ఉండకపోవచ్చు. వీటిని ఖర్జూరాలతో కలిపి తీసుకోవడం ద్వారా అదనపు శక్తి, రుచి లభిస్తాయి. పల్లీల ద్వారా బలం, కండలు, స్టామినా పెరగాలనుకునేవారు, శారీరక శ్రమ చేసేవారు, గర్భిణులు, బాలింతలు నానబెట్టిన పల్లీలను కూడా రెగ్యులర్‌గా వాడుకోవచ్చు.
వేపించిన పల్లీలు: వేపించిన పల్లీలు చాలామందికి ఇష్టమైన ఆహారం ఇది. పచ్చి లేదా నానబెట్టిన పల్లీలను ఇష్టపడని వారు కూడా వీటిని తినడానికి ఆసక్తి చూపుతారు. ఇసుకలో దోరగా వేపించిన పల్లీలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రయాణాలలో, లేదా ఎమర్జెన్సీ ఫుడ్‌గా ఇవి చాలా అనుకూలం. జిప్ కవర్లలో ప్యాక్ చేసుకుని ఖర్జూరాలు, అరటిపండు, జామపండ్లతో కలిపి తీసుకుంటే ఒక పూర్తి భోజనంగా కూడా పనికొస్తాయి.
వేచింన పల్లీలు ఎవరు తినాలి, ఎవరు తినకూడదు
అయితే, అరుగుదల సరిగా లేనివారు, ఆకలి మందంగా ఉన్నవారు, వృద్ధులు, చిన్నపిల్లలు వేపించిన పల్లీలను తినకూడదు, ఎందుకంటే ఇవి ఆకలిని తగ్గిస్తాయి. వేపించిన పల్లీలు ప్రధానంగా ఎవరికి మేలు చేస్తాయంటే, తరచుగా ఆకలి వేసే వారికి. డిన్నర్‌లో పండ్లు లేదా ఇతర నట్స్ తిన్నా రాత్రిపూట ఆకలి వేసేవారు వేపించిన పల్లీలను కూడా కలిపి తీసుకోవచ్చు.
అయితే పల్లీలు కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, మన శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచే అద్భుతమైన పోషక వనరు. ఈ మూడు రూపాలను సరైన పద్ధతిలో, అవసరాన్ని బట్టి వినియోగించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ పల్లీల ప్రయోజనాలను పొందవచ్చు.
మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
