
వేడి పెరిగే కొద్దీ నీటిలోని ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి, ఇది చేపల ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అందుకే ఈ ఎండల నుంచి అక్వేరియంను, అందులోని చేపలను కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందే. నిపుణులు సూచిస్తున్న కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగా ఏ సీజన్‌లోనైనా అక్వేరియం నీళ్లను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం, అయితే వేసవిలో నీళ్లు త్వరగా వేడెక్కుతాయి కాబట్టి తరచూ మార్చాలి. ఇక్కడ చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. నీళ్లు చల్లగా ఉండాలని అందులో ఐస్ ముక్కలు వేయడం లేదా నేరుగా ఐస్ వాటర్ పోయడం. ఇలా చేయడం వల్ల ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయి చేపల జీవక్రియ దెబ్బతింటుంది, ఇది వాటికి ప్రాణాంతకం కావచ్చు. నీళ్లు మరీ వేడిగా లేదా మరీ చల్లగా కాకుండా సాధారణ స్థితిలో ఉండేలా చూసుకోవాలి. అలాగే అక్వేరియంలో ఉండే రాళ్లు, పచ్చగడ్డి వంటి అలంకరణ వస్తువులను కూడా నిర్ణీత సమయాల్లో శుభ్రం చేయాలి.
మరో ముఖ్యమైన విషయం లైటింగ్. అక్వేరియం అందంగా కనిపించాలని చాలామంది పగలంతా లైట్లు ఆన్ చేసే ఉంచుతారు. దీనివల్ల గాజు పాత్ర వేడెక్కి నీటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి పగటిపూట లైట్లు ఆర్పేయడం మంచిది, ఒకవేళ అవసరమైతే మార్కెట్లో దొరికే ఫిష్ ఫ్రెండ్లీ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి నీటిని వేడి చేయవు.
అక్వేరియంను ఎక్కడ ఉంచుతున్నామనేది ఈ సీజన్ లో చాలా కీలకం. గదిలో గాలి తగిలే ప్రదేశంలో లేదా చల్లగా ఉండే మూలన దీనిని అమర్చాలి. కిటికీల దగ్గర ఎండ నేరుగా తగిలేలా ఉంచకూడదు. ప్రస్తుతం మార్కెట్లో అక్వేరియంల కోసం ప్రత్యేకమైన క్లిప్ ఫ్యాన్లు దొరుకుతున్నాయి, వీటిని ఏర్పాటు చేయడం వల్ల నీరు వేడెక్కకుండా కాపాడుకోవచ్చు. నీటి వేడి పెరిగే కొద్దీ అందులో ఆక్సిజన్ తగ్గిపోతుంది కాబట్టి, పైన ఉండే వెంటిలేషన్ మూతను ఎప్పుడూ తెరిచి ఉంచాలి.
ఆక్సిజన్ కొరత రాకుండా ఉండాలంటే అక్వేరియంలో ఒక ఏరేటర్‌ని ఏర్పాటు చేయడం ఉత్తమం. ఇది నీటి ఉపరితలంపై నిరంతరం కదలికను కలిగిస్తూ ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది. ఒకవేళ చేపలు నీటి పైకి వచ్చి నోరు తెరుస్తూ గాలి కోసం ప్రయత్నిస్తుంటే, అందులో ఆక్సిజన్ తగ్గిందని గుర్తించాలి. అలాంటి సమయంలో లిక్విడ్ ఆక్సిజన్ డ్రాప్స్ వాడటం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. మీరు తీసుకునే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీ అక్వేరియం చేపలను ఎండల నుంచి రక్షించి, వాటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ వేసవిలో మీ చిన్నారి చేపల ప్రపంచం చల్లగా ఉండేలా చూసుకోండి.