
పళ్లను శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి అత్యవసరం. మనలో చాలా మంది దీనిని పెద్ద పనిగా భావిస్తారు. కానీ మీరు మీ పళ్లను ఎంత తరచుగా లేదా ఎంత గట్టిగా తోముకుంటున్నారు అనే దానిపైనే మీ నోటి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అతిగా బ్రష్ చేయడం లేదా చాలా గట్టిగా తోమడం మంచిది కాదని దంత వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న యువకులు కూడా పళ్ళను బాగా గట్టిగా రుద్దడం వల్ల సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం అనుకోవడం వల్ల పళ్లు పాడవుతున్నాయి. చాలా గట్టిగా బ్రష్ చేయడంతో చిగుళ్ల క్షీణత, ఎనామెల్ అరిగిపోవడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం అనేది సాధారణంగా పాటించే నియమం. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం.. తరచుగా బ్రష్ చేసేవారు బ్రషింగ్ నాణ్యత, సాంకేతికతపై తక్కువ దృష్టి పెడతారు.
ఎనామెల్ అరిగిపోవడం: పళ్ళను శుభ్రం చేయడానికి మీరు స్క్రబ్ చేసినంత గట్టిగా తోమాల్సిన అవసరం లేదు. గట్టిగా తోమితే పైన ఉండే పంటి రక్షణ పొర అయిన ఎనామెల్ అరిగిపోతుంది. ఎనామెల్ పోయిన తర్వాత లోపల ఉన్న డెంటిన్ బయటపడుతుంది. దీనివల్ల పళ్ళు త్వరగా పుచ్చిపోవడం, సున్నితత్వం పెరగడం జరుగుతుంది.
అతిగా తోమడం: చాలా మంది ప్రతిసారి తిన్న తర్వాత పళ్ళు తోముకుంటారు. ఇది మంచి అలవాటు కాదు. ముఖ్యంగా మీరు పులుపు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్న వెంటనే బ్రష్ చేస్తే, ఆమ్లాలు బలహీనపరిచిన ఎనామెల్ మరింత త్వరగా అరిగిపోతుంది. రోజుకు రెండుసార్లు అంటే ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు మృదువుగా బ్రష్ చేస్తే చాలు.
తప్పు టెక్నిక్: మీరు ఎంత తరచుగా బ్రష్ చేస్తున్నారు అనేది కాదు.. ఎలా చేస్తున్నారు అనేదే ముఖ్యం. గట్టి ముళ్ళ బ్రష్‌లు వాడటం వల్ల, పళ్ళను అడ్డంగా రుద్దడం వల్ల చిగుళ్ళు క్షీణించి పళ్ళు లూజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
పళ్ళను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే వాటిని పాడు చేయకూడదు. కాబట్టి పళ్ళను సున్నితంగా, సరైన పద్ధతిలో తోముకుంటూ ఆరోగ్యంగా ఉంచుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..