కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే మాస్టర్ మంత్రం.. చేపలు తింటే శరీరంలో జరిగే మిరాకిల్స్ ఇవే..
కొలెస్ట్రాల్ నియంత్రణలో చేపలు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేపల్లో సమృద్ధిగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడంతో పాటు ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. వారానికి కనీసం రెండు సార్లు చేపలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తుండగా, చేపలు తినని వారికి అవిసె గింజలు, సబ్జా గింజలు వంటి ఒమేగా-3 సమృద్ధిగా ఉండే ఆహారాలు మంచి ప్రత్యామ్నాయాలుగా ఉపయోగపడతాయి.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయుల సమతుల్యత శరీరానికి అత్యవసరం.. అందుకే.. ఇలాంటి విషయాలపై అవవగాహనతో ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. శరీరానికి మేలు చేసే ఆహారాల్లో చేపలు ఒకటి.. చేపలు తినడం వల్ల శరీరంలో అద్భుతాలను చూడొచ్చని, ముఖ్యంగా కొలెస్ట్రాల్ నియంత్రణపై అవి ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయిని ఆహార నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్‌లో మంచి కొలెస్ట్రాల్ (HDL), చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. భారతీయ జనాభా, ముఖ్యంగా దక్షిణ ఆసియా వాసులు, ఎథిరోజెనిక్ లిపిడ్ ప్రొఫైల్ అనే ప్రత్యేక కొలెస్ట్రాల్ నమూనాను కలిగి ఉంటారు. దీనిలో అధిక ట్రైగ్లిజరైడ్స్, తక్కువ HDL, చిన్న, దట్టమైన LDL (స్మాల్ డెన్స్ LDL) అనే చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి. ఈ కలయిక రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడటానికి ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. ఈ జీవక్రియ లోపాన్ని సరిదిద్దడానికి ఆహారపు అలవాట్లలో మార్పులను సూచిస్తున్నారు. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే అన్నం, చక్కెర, బెల్లం, పండ్లు, తేనె, దుంపలు వంటి వాటిని తగ్గించాలని ఆయన నొక్కి చెప్పారు. దీనికి విరుద్ధంగా, HDL కొలెస్ట్రాల్‌ను పెంచే, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించే ఆహారాలను తీసుకోవాలని సూచించారు.
చేపల అద్భుత ప్రయోజనాలు:
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో చేపలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. HDL స్థాయులు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయులు తక్కువగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్యకరమైన లిపిడ్ ప్రొఫైల్ ఉన్నవారికి గుండెపోటు, పక్షవాతం వంటివి వచ్చే అవకాశం చాలా తక్కువ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ అద్భుతాలకు కారణం. ఈ ఒమేగా-3 లు సముద్రపు చిన్న మొక్కల్లో లభిస్తాయి. చేపలు వాటిని తినడం ద్వారా తమ శరీరంలో పేరుకుపోతాయి. ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఉండే చేపలలో (ఆయిలీ ఫిష్) ఇవి అధికంగా ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారానికి కనీసం రెండు సార్లు చేపలు తినాలని సిఫార్సు చేస్తుంది. అయితే, ఎన్ని ఎక్కువ సార్లు తింటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.
శాకాహారులకు ప్రత్యామ్నాయాలు:
చేపలు తినని శాకాహారుల కోసం, నిపుణులు ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు. చేపల నూనె క్యాప్సూల్స్ (ఫిష్ లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్) రోజుకు రెండు తీసుకోవచ్చు. చేపల వాసన కూడా పడని వారికి, అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్), సబ్జా గింజలు అద్భుతమైన ఎంపికలు. అవిసె గింజల్లో దాదాపు 55% ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు ఒక గుప్పెడు అవిసె గింజలు లేదా సబ్జా గింజలు తీసుకోవడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఆయన తెలిపారు.
మొత్తంగా, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించి, HDL పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. దీనికి కార్బోహైడ్రేట్లను తగ్గించడం, చేపలు లేదా ఒమేగా-3 అధికంగా ఉండే అవిసె గింజలు వంటి ఆహారాలను తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. ఈ సమగ్ర విధానం ద్వారా జీవక్రియ లోపాలను సరిదిద్దుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు..
ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సందేహాలున్నా.. సమస్యలున్నా.. నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
