అసలే కరోనాకాలం.. ఆపై ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్‌లో మనం ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కువ పోషకాలు లభించే ఆహారం తీసుకోవాలి. అలాగే తగిన జాగ్రత్తలు కూడా పాటించాలి.
ఇదిలా ఉంటే వాతావరణంలోని మార్పు కారణంగా చాలామందికి జలుబుతో పాటు దగ్గు వేధిస్తుంటుంది. దీనిని నివారించేందుకు పలు టాబ్లెట్స్ వాడినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కాగా, ఈ దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు మీరు పలు వంటింటి చిట్కాలు ట్రై చేయవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
తేనె(Honey) – తేనె ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇది యాంటీవైరల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. గొంతునొప్పిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. హెర్బల్ టీ లేదా వేడినీటిలో 2 టీస్పూన్ల తేనె కలుపుకుని తాగితే మీకు దగ్గు నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.
వెల్లుల్లి(Garlic) – యాంటీవైరల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాల సమ్మేళనం వెల్లుల్లి. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చు. అలాగే వెల్లుల్లి.. రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుంది. వెల్లుల్లిని వేయించి, రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనెతో తినడం ద్వారా దగ్గు నుండి ఉపశమనం పొందండి.
బ్రోమెలైన్(Bromelain)- పైనాపిల్‌లో ‘బ్రోమెలైన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. అది దగ్గుకు చెక్ పెట్టే సరైన ఔషధం. పలు అధ్యాయాల ప్రకారం.. పైనాపిల్ సైనస్ వ్యాధితో పాటు అలెర్జీ సమస్యను నివారిస్తుంది. దగ్గు విషయంలో, పైనాపిల్ ముక్కలు తినడం లేదా.. 250ml పైనాపిల్ రసాన్ని రోజూ రెండుసార్లు తాగడం ద్వారా మీకు ఉపశమనం లభిస్తుంది.
పసుపు(Tumeric) – పసుపు ఓ ఆయుర్వేద ఔషదం. అనేక ఆరోగ్య సమస్యలకు దీని ద్వారా చెక్ పెట్టొచ్చు. యాంటీవైరల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పసుపులో పుష్కలంగా ఉన్నాయి. ప్రతీ రోజూ రాత్రి నిద్రపోయే ముందు 1/4 టీస్పూన్ పసుపును గ్లాసు పాలలో కలిపి తాగితే మీకు దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే గోరు వెచ్చని నీటిని రోజూ తాగడం, ఆవిరి పట్టడం వంటివి చేసినా దగ్గు, గొంతునొప్పికి చెక్ పెట్టొచ్చునని డాక్టర్లు సూచిస్తున్నారు.
Also Read:
పాపం మొసలి.! కొండచిలువ తలను కొరికింది.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. వైరల్ వీడియో!
ఈ ఫోటోలో మంచు చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.! మెదడుకు పదును పెట్టండి!