
నేటి కార్పొరేట్ కార్యాలయాల్లో ఒక ఆసక్తికరమైన ‘కోల్డ్ వార్’ నడుస్తోంది. అదే ’90స్ కిడ్స్’ (మిలీనియల్స్) మరియు ‘2కే కిడ్స్’ (జెన్ జీ) మధ్య సాగుతున్న సైద్ధాంతిక పోరాటం. ఒకప్పుడు ఉద్యోగమే జీవితం అనుకున్న తరం ఒకవైపు ఉంటే, జీవితంలో ఉద్యోగం ఒక భాగం మాత్రమే అని నమ్మే తరం మరోవైపు ఉంది. ఈ రెండు తరాల మధ్య ఉన్న పని సంస్కృతి, ఆలోచనా ధోరణులలోని వ్యత్యాసాలను తెలుసుకుందాం..
90వ దశకంలో పుట్టిన మిలీనియల్స్ మేనేజర్ ఏ పని చెప్పినా కాదనకుండా చేసేవారు. వారాంతాల్లో కూడా ల్యాప్‌టాప్‌తో కుస్తీ పట్టడాన్ని ఒక బాధ్యతగా, గర్వంగా భావించేవారు. కానీ నేటి ‘జెన్ జీ’ యువత ధోరణి అందుకు భిన్నం. సాయంత్రం 5 గంటలు కాగానే మొహమాటం లేకుండా ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి బయటకు వచ్చేస్తారు. తాము తీసుకునే జీతానికి తగ్గట్టుగా మాత్రమే పని చేస్తామనేది వారి స్పష్టమైన పాలసీ. దీనినే పాత తరం ‘అహంకారం’ అని పొరబడుతోంది.
ఒకప్పుడు బాస్ చెప్పిందే వేదం. అది తప్పైనా ఒప్పైనా తల ఊపి చేసేవారు. కానీ ఇప్పటి తరం అలా కాదు. “ఈ పని ఎందుకు చేయాలి? దీనివల్ల కంపెనీకి లేదా నాకు వచ్చే లాభం ఏంటి?” అని తార్కికంగా ప్రశ్నిస్తున్నారు. అనుభవానికి ఇచ్చే గౌరవం కంటే, పనిలో ఇచ్చే గౌరవానికే వారు ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ గౌరవం లేదనిపిస్తే, మరుక్షణమే రాజీనామా పత్రాన్ని చేతిలో పెట్టడానికి అస్సలు వెనకాడరు.
తీవ్రమైన జ్వరం వస్తే తప్ప సెలవు అడగని రోజులు పోయాయి. “ఈరోజు నేను ఒత్తిడిగా ఉన్నాను, నాకు మెంటల్ హెల్త్ బ్రేక్ కావాలి” అని ధైర్యంగా అడిగే తెగింపు ఈ తరానికే ఉంది. మానసిక వేదనతో పని చేయడం కంటే, విశ్రాంతి తీసుకోవడం తప్పు కాదని వారు బలంగా నమ్ముతారు. పాత తరానికి ఇది షాకింగ్ గా అనిపించినా, ఇది నేటి కాలపు అవసరం.
జెన్ జీ యువతలో ఉన్నది ‘ఆటిట్యూడ్ సమస్య’ కాదు, వారు తమ వ్యక్తిగత జీవితానికి, వృత్తికి మధ్య ఒక స్పష్టమైన గీతను గీసుకున్నారు. మిలీనియల్స్ తమ హక్కుల గురించి అడగడానికి సంకోచిస్తే, నేటి తరం తల ఎత్తుకుని తమ హక్కులను డిమాండ్ చేస్తోంది. వారిని తప్పు పట్టడం కంటే, పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత ఎలా కాపాడుకోవాలో వారిని చూసి నేర్చుకోవడం పాత తరానికి మంచిది.