
మనిషి జీవితం అనంతమైన రైలు మార్గం వంటిది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. అయితే ఈ ప్రయాణంలో మనం సరిగా నేర్చుకోనిది, నేర్చుకోవాల్సింది ‘కోపం’. కోపంలో వచ్చే కఠినమైన పదాలు విషం కంటే ప్రమాదకరం. వేడి వస్తువును తాకినప్పుడు శరీరం కాలిపోతుందని ఎంత జాగ్రత్తగా ఉంటామో, నోటి నుంచి వచ్చే మాటల విషయంలోనూ అంతే అప్రమత్తత అవసరం. చేతిలో నుంచి జారిపడిన అద్దంలాగే మాట కూడా పదునైనది. అది ఎదుటివారి మనసులో చెదరని గాయాన్ని మిగులుస్తుంది. ఎవరితో, ఎలా మాట్లాడుతున్నామో గమనించుకోవడమే విజ్ఞత అనిపించుకుంటుంది.
నమ్మకం.. జాగ్రత్త..
నేటి కాలంలో ఎదుటివారిని గుడ్డిగా నమ్మడం సరికాదు. చాలామంది మనసుల్లో అనుమానం, మోసం నిండి ఉంటున్నాయి. మన చుట్టూ ఉండే స్నేహితులు, బంధువులలో కొందరు ముఖం మీద ముద్దుగా మాట్లాడుతూనే, వెనుక మరోలా వ్యవహరిస్తుంటారు. అటువంటి కపట వ్యక్తులను గుర్తించి, వారి నుంచి మెల్లగా దూరం కావడం మేలు. ఇది పిరికితనం కాదు, మన ప్రశాంతత కోసం తీసుకునే తెలివైన నిర్ణయం.
అంగీకారమే ఆనందం
వయసు పెరిగే కొద్దీ మనిషికి నేర్చుకోవడం కంటే విషయాలను అంగీకరించడం అలవడాలి. ఆర్థిక ఇబ్బందులు, శారీరక మార్పులు ఎదురైనప్పుడు పరిణతి, దైవచింతన మనకు అండగా నిలుస్తాయి. ఏ సహాయం చేసినా మన స్థాయికి మించి గర్వంతో అంతా ఇచ్చేయకూడదు. అవసరానికి మించి అన్నీ ధారపోస్తే.. మనకు అవసరమైనప్పుడు ఆదుకునేవారు ఉండకపోవచ్చు. లోకరీతిని అర్థం చేసుకుని, లోపల ఒకలా బయట మరోలా ఉండేవారికి దూరంగా ఉంటూ.. హుందాగా జీవించడమే పరమార్థం.