30 ఏళ్లు దాటాక భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే ఈ విషయాలు మర్చిపోవద్దు..!

30 ఏళ్లు దాటాక మన జీవితం చాలా మారుతుంది. బాధ్యతలు పెరుగుతాయి, ఆశలు ఎక్కువుతాయి. అలాంటి సమయంలో ప్రేమ ఒక్కటే సరిపోదు. భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే.. కొన్ని ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలి. బాధ్యతలు పెరిగినా ప్రేమ తగ్గకూడదు. ప్రేమను చూపించడానికి రోజూ కాస్త సమయం కేటాయించాలి. మొబైల్, టీవీ పక్కన పెట్టి, కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాలి. చిన్న బహుమతులు, తీపి మాటలు, అనుకోని ఆహ్వానాలు బంధాన్ని మరింత దగ్గరగా చేస్తాయి.

30 ఏళ్లు దాటాక భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే ఈ విషయాలు మర్చిపోవద్దు..!
Happy Couple

Updated on: Jun 26, 2025 | 5:30 PM

భాగస్వామితో రోజువారీ విషయాలు పంచుకోవడం చాలా ముఖ్యం. మీకు ఏం నచ్చదు, ఏం కావాలి, మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనే విషయాలను గౌరవంగా, నిజాయితీగా చెప్పగలగాలి. కోరికలు, అవసరాలు మాట్లాడుకుంటే బంధం నమ్మకంగా మారుతుంది. ప్రతి ఒక్కరిలో తప్పులు ఉంటాయి. వాటిని చూపించి బాధ పెట్టే బదులు.. అర్థం చేసుకుని ఓర్పుతో మాట్లాడటం మంచిది. ఎదుటి వారిని మార్చడానికి ప్రయత్నించే బదులు.. వారిని ఎలా అంగీకరించాలో నేర్చుకోవడం బంధానికి మంచిది. పరిపూర్ణత కోసం కాదు.. సంపూర్ణత కోసం జీవించాలి.

30 ఏళ్ల వయసులో జీవిత భారం పెరుగుతుంది. ఉద్యోగ ఒత్తిడి, పిల్లల పెంపకం, డబ్బు ప్లానింగ్.. ఇవన్నీ ఒకరి మీదే ఉంటే బంధానికి నష్టం. ఇద్దరూ కలిసి కూర్చుని ప్లాన్ చేసుకుంటే.. సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి.

తగాదాలు రావచ్చు. కానీ వాటిని పెద్దవి చేసుకోకండి. గతం తవ్వకుండా ప్రస్తుత సమస్యకు పరిష్కారం ఎలా అనేది చూడాలి. కొన్నిసార్లు నీది తప్పు, నేను ఏం చేశాను..? అనే చర్చల కన్నా.. ఇది ఎలా పరిష్కరిద్దాం..? అనే ఆలోచన అవసరం.

పొదుపు, ఖర్చులు, పెట్టుబడుల విషయంలో ఇద్దరూ దాచుకోకుండా.. ఓపెన్‌ గా మాట్లాడుకోవాలి. కుటుంబ అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలపై ఒకే అభిప్రాయం ఉండాలి. ఇలా చేస్తే భద్రతా భావం పెరుగుతుంది.

వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్య పరీక్షలు.. ఇవి మాత్రమే కాదు భాగస్వామిని శ్రద్ధగా చూసుకోవడం కూడా ప్రేమను పెంచుతుంది.

ప్రేమ బంధం ప్రారంభానికి కారణం. కానీ దాన్ని కొనసాగించాలంటే.. ఆప్యాయత, ఓర్పు, నమ్మకం, పరస్పర సహకారం అవసరం. ఈ విలువలతో ప్రేమ వయసును దాటి జీవితాంతం నిలుస్తుంది.