
ఇల్లు లేదా ఆఫీస్ టేబుల్‌ను అలంకరించుకోవడానికి చాలామంది లక్కీ బాంబూ వెదురు మొక్కను పెంచుతుంటారు. అయితే దీనిని మట్టిలో పెంచాలా లేక నీటిలోనా అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. నిపుణుల ప్రకారం, లక్కీ బాంబూ వేగంగా, బలంగా పెరగడానికి మట్టి అత్యంత ఉత్తమమైనది. మట్టి నుండి లభించే పోషకాల వల్ల మొక్క ఆకులు ముదురు పచ్చగా మారి, ఎక్కువ కాలం బతుకుతుంది. ఒకవేళ ఇంటీరియర్ లుక్ కోసం నీటిలో పెంచాలనుకుంటే, ప్రతి 7 నుండి 10 రోజులకు ఒకసారి నీటిని మార్చాలి. అలాగే క్లోరిన్ ఉండే కుళాయి నీళ్లకు బదులుగా కేవలం ఆర్‌ఓ (RO) లేదా ఫిల్టర్ నీటిని మాత్రమే వాడాలి.
లక్కీ బాంబూ సహజంగానే మట్టిలో పెరిగే మొక్క. ఒకవేళ మీరు దీనిని కుండీలో మట్టి వేసి పెంచితే, మొక్కకు కావలసిన అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఫలితంగా మొక్క చాలా వేగంగా, బలంగా పెరుగుతుంది. వేర్లు గట్టిపడి, కొత్త రెమ్మలు త్వరగా వస్తాయి. ఆకులు ఎల్లో కలర్‌లోకి మారకుండా ముదురు పచ్చ రంగులో నిగనిగలాడుతుంటాయి. నీటిలో పెరిగే మొక్కలతో పోలిస్తే, మట్టిలో పెరిగే లక్కీ బాంబూ ఎక్కువ సంవత్సరాలు బతుకుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కుండీలో మట్టి ఎప్పుడూ మరీ బురదగా ఉండకూడదు. కేవలం తేమ ఉంటే సరిపోతుంది.
చాలామంది అందమైన గాజు బౌల్స్‌లో, రంగు రంగుల రాళ్లు వేసి నీటిలో లక్కీ బాంబూను పెంచుతుంటారు. ఇది ఇంటికి మోడరన్ లుక్ ఇస్తుంది. మట్టి వల్ల వచ్చే గందరగోళం ఉండదు. కానీ నీటిలో పెంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా బౌల్‌లోని నీటిని ప్రతి 7 నుండి 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మార్చాలి. లేదంటే వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది. మున్సిపాలిటీ లేదా కుళాయిల ద్వారా వచ్చే క్లోరిన్ కలిగిన నీటిని అస్సలు వాడకూడదు. కేవలం ఆర్‌ఓ లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే వాడాలి.
మీరు కేవలం టేబుల్ డెకరేషన్ లేదా ఇంటీరియర్ లుక్ కోసం చిన్న సైజులో మొక్కను ఉంచాలనుకుంటే నీటిలో పెంచడం మంచి ఆప్షన్. కానీ, మొక్క ఆరోగ్యంగా, ఎక్కువ కాలం, వేగంగా పెరగాలని కోరుకుంటే మాత్రం దానిని మట్టిలో నాటడమే అత్యంత ఉత్తమమైన పద్ధతి. ఒకవేళ నీటిలో ఉన్న మొక్క ఆకులు పసుపు రంగులోకి మారుతుంటే, వెంటనే దానిని కుండీలో మట్టిలోకి మార్చడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..