పిండి పరుగులు పట్టిందా.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే ఎన్నిరోజులైనా ఫ్రెష్‌గా ఉంటుంది..
చపాతీలు చేద్దామని గోధుమపిండి డబ్బా మూత తీయగానే.. లోపల చిన్న చిన్న నల్లటి పురుగులు పాకుతూ, సాలెగూడులాంటి వలలు కనిపిస్తే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. డబ్బాను గట్టిగానే మూసి ఉంచినా, మార్కెట్ నుంచి అప్పుడే తెచ్చిన కొత్త ప్యాకెట్లలో కూడా ఇవి ఎలా దూరిపోతాయో చాలామందికి అర్థం కాదు. పురుగులు పట్టినప్పుడు వెంటనే ఏం చేయాలి? వంటింట్లో ఈ సమస్య లేకుండా ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వంటగదిలో మనం నిత్యం ఉపయోగించే గోధుమ పిండి, బియ్యం పిండి, మైదా, శనగపిండి లేదా ఉప్మా రవ్వ డబ్బాలను తీసినప్పుడు ఒక్కోసారి చిన్న చిన్న పురుగులు పాకుతూ, సాలెగూడు లాంటి జిగురు వలలు కట్టి ఉండటం చూస్తుంటాం. ఎంతో శుభ్రంగా దాచుకున్నా, కొన్నిసార్లు కొత్తగా మార్కెట్ నుంచి తెచ్చిన ప్యాకెట్లలో కూడా కొద్ది రోజులకే ఇలాంటివి కనిపించగానే మహిళలకు ఏం చేయాలో పాలుపోదు. పిండి పాడైపోయిందని బాధపడటంతో పాటు రోజూ తినే ఆహారంలో ఇలాంటివి చేరడం వల్ల ఆరోగ్యంపై ఎక్కడ ప్రభావం పడుతుందోనన్న ఆందోళన మొదలవుతుంది. అసలు మనం ఎంతో భద్రంగా దాచే డబ్బాల్లోకి ఈ కీటకాలు ఎలా వస్తాయి? వాటిని చూసిన వెంటనే ఏం చేయాలి? అసలు వంటింట్లో పిండి నిల్వలకు పురుగులు పట్టకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం.
పిండిలో చేరే ఆ పురుగులు ఏమిటి?
గోధుమలు, శనగపిండి, మైదా, రవ్వ, బియ్యం, మసాలాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పొడి ఆహార పదార్థాల్లో చేరే కీటకాలను శాస్త్రీయంగా ప్యాంట్రీ పెస్ట్స్ అని పిలుస్తారు.
కనిపించే తీరు: ఇవి చిన్న ఎరుపు-గోధుమ రంగులో లేదా నలుపు రంగులో ఉండే చిన్న కీటకాలుగా దర్శనమిస్తాయి. కొన్నిసార్లు క్రీమ్ లేదా తెలుపు రంగులో ఉండే చిన్న లార్వాలు, పిండి లోపల సాలెగూడును పోలిన జిగురు దారాల వలలు కనిపిస్తాయి.
ఎలా వస్తాయి?: ఇవి మనం ఇంట్లో నిల్వ ఉంచినప్పుడు మాత్రమే వచ్చేవి కావు. సరుకులు కొనుగోలు చేసే ప్యాకెట్లలోనే వీటి సూక్ష్మ గుడ్లు లేదా లార్వాలు ఉండిపోతాయి. ఇంట్లోకి తెచ్చి కొన్ని రోజులు నిల్వ ఉంచినప్పుడు అనుకూల వాతావరణం ఏర్పడి అవి పిల్లలుగా మారి సంఖ్యను పెంచుకుంటాయి.
పురుగులు కనిపిస్తే మొదట చేయాల్సిన పనులివే..
వెంటనే పారేయండి: పిండిలో కీటకాలు, లార్వాలు లేదా బూజు వంటి వలలు స్పష్టంగా కనిపిస్తే ఆ పిండిని ఏమాత్రం వాడకూడదు. కవర్‌లో గట్టిగా కట్టి ఇంటి బయట ఉండే డస్ట్‌బిన్‌లో పడేయాలి.
పరిసరాల తనిఖీ: పురుగులు పట్టిన డబ్బా పక్కనే ఉన్న పప్పులు, బియ్యం, బిస్కెట్లు, మసాలా దినుసుల ప్యాకెట్లను వెంటనే క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే ఈ కీటకాలు పక్క డబ్బాల్లోకి సులభంగా వ్యాపిస్తాయి.
అరల శుభ్రత: వంటగది అరలు, డబ్బాల మూలల్లో పిండి రేణువులు రాలి ఉంటే వాటిని పూర్తిగా తుడవాలి లేదా వాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేయాలి.
పురుగులు పట్టకుండా వంటింటిని కాపాడుకునే చిట్కాలు
ఎయిర్ టైట్ డబ్బాలు: పిండి ప్యాకెట్లను తెరిచి అలాగే ఉంచకూడదు. గాలి చొరబడని గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాల్లోకి మార్చి గట్టిగా మూత పెట్టాలి.
కొనేటప్పుడే చెక్ చేయండి: కిరాణా సరుకులు కొనేటప్పుడు ప్యాకెట్ సీల్ సరిగ్గా ఉందా లేదా, ఎక్కడైనా చిరిగిపోయిందా అనేది చూసి కొనుగోలు చేయాలి.
పాత సరుకులే ముందు: కొత్త ప్యాకెట్ ఓపెన్ చేసేముందు ఇంట్లో ఉన్న పాత నిల్వలను పూర్తిగా వాడేయాలి.
ఎప్పటికప్పుడు క్లీనింగ్: వంట సమయంలో లేదా డబ్బాలు తీసేటప్పుడు కింద పడిన పిండి, ధాన్యాల పొడిని వెంటనే తుడిచేయాలి. నెలకోసారైనా వంటగది రాక్స్‌ను శుభ్రపరుచుకుంటే ఈ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు.
