Jackfruit: పనస పండు తిని వాహనం నడుపుతున్నారా..? మీరు పోలీసుల వద్ద బుక్కైపోతారు..

పనస పండు పోషకాల పవర్ హౌస్. కానీ పనస పండు తిని వాహనం నడిపితే మీకు ఇబ్బందులు తప్పవు. అలా చేస్తే మీరు పోలీసులకు చిక్కి తిప్పలు పడతారు. పనస పండు తింటే పోలీసులు ఎందుకు పట్టుకుంటారు అనేగా మీ డౌట్. అది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Jackfruit: పనస పండు తిని వాహనం నడుపుతున్నారా..? మీరు పోలీసుల వద్ద బుక్కైపోతారు..
Jack Fruit Alcohol

Updated on: Jul 23, 2025 | 7:21 PM

పనస పండు.. పోషకాల నిలయం అని అంటారు. దీన్ని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న పనస పండును తిని డ్రైవింగ్ చేస్తున్నారా..? అలా అయితే మీరు పోలీసులకు చిక్కినట్లే.. పనస పండు తింటే పోలీసులకు చిక్కడమేంటీ..? అనుకుంటున్నారా..? కానీ అదే నిజం. ఇటీవల కేరళలో ముగ్గురు ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్‌లో మద్యం తాగినట్లు తేలింది. దీంతో వారిపై కేసు నమోదు అయ్యింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.? వారిలో ఎవరూ మద్యం తాగలేదు. కానీ అలా ఎలా వచ్చిందని అంతా ఆశ్చర్యపోయారు. చివరకు పనస పండు తినడం వల్ల అలా వచ్చిందని తెలుసుకుని షాక్ అయ్యారు.

తాము మద్యం తాగలేదని.. చివరగా పనస పండు మాత్రమే తిన్నామని డ్రైవర్లు అధికారులకు విన్నవించారు. దీంతో అధికారులు దీనిపై చిన్న ప్రయోగం చేశారు. బ్రీత్ అనలైజర్ టెస్టులో నెగిటివ్ వచ్చిన డ్రైవర్‌ను కొన్ని పనస పండు ముక్కలు తినమని చెప్పారు.  ఆ తర్వాత కొద్దిసేపటికే అతడిని టెస్ట్ చేయగా.. ఆల్కహాల్ తీసుకున్నట్లు చూపించింది. దీంతో అధికారులు అవాక్కయ్యారు. ఆ ముగ్గురు డ్రైవర్లపై పెట్టిన కేసును వెనక్కి తీసుకున్నారు.

పనస పండు తింటే ఆల్కహాల్ తాగినట్లు ఎందుకు వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఎక్కువగా పండిన జాక్ ఫ్రూట్‌లో అధిక గ్లూకోజ్ – ఫ్రక్టోజ్ ఫర్మెంటేషన్ కారణంగా తక్కువ మొత్తంలో ఆల్కహాల్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దీనిని వైన్ తయారీలోనూ ఉపయోగిస్తారని తెలుస్తోంది.  తక్కువ సందర్భాలలో మాత్రమే బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో ఆల్కహాల్‌ తీసుకున్నట్లు చూపిస్తుందని నిపుణులు తెలిపారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..