రోజూ ఒక్క చెంచా తింటే చాలు.. జుట్టు మంచిగా పెరుగుతుంది.. పెద్దలు చెప్పిన ముచ్చట ఇది..
కరివేపాకు కారం పొడి అనేది తెలుగు వంటకాల్లో ఒక ప్రముఖమైన, ఆరోగ్యకరమైన ఆహారం.. ఈ కారప్పొడిని ఇంట్లోనే సులభంగా, సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసుకోవచ్చు. కరివేపాకులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కారం పొడిని అన్నం, ఇడ్లీ, దోస, ఉప్మా వంటి వాటితో కలిపి తీసుకోవచ్చు.

కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలతోపాటు.. పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. అందుకే.. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే.. కరివేపాకులో విటమిన్లు ఎ, బి, సి, ఇ, అలాగే కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకు రోజూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటం, జుట్టు ఆరోగ్యంగా పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే.. కరివేపాకు రెసిపీల్లో కరివేపాకు కారం పొడి ఒకటి.. కరివేపాకు కారం పొడి అనేది దక్షిణ భారతీయ వంటకాలలో ఒక విశిష్టమైన.. ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో కరివేపాకును చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. ఇటువంటి కరివేపాకును కారం పొడి రూపంలో తయారుచేసుకుని రోజూవారీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే.. ఈ కరివేపాకు కారం పొడిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
- కరివేపాకు – 2 కప్పులు (శుభ్రం చేసి, ఆరబెట్టింది)
- ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు
- పచ్చిశనగపప్పు – 1 టేబుల్ స్పూన్
- మినపగుళ్ళు – 1 టేబుల్ స్పూన్
- ధనియాలు – 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర – 1/2 టేబుల్ స్పూన్
- మెంతులు – 1/8 టీ స్పూన్ (కొద్దిగా)
- ఎండుమిరపకాయలు – 10-15 (మీ కారానికి తగినట్టు)
- ఇంగువ – 1/4 టీ స్పూన్
- పసుపు – 1/4 టీ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు – 10 (తొక్కలతో సహా)
- చింతపండు – కొద్దిగా
- ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం:
పప్పులు – సుగంధ ద్రవ్యాలు వేయించడం: స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని, అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి దోరగా వేయించుకోండి. ఇవి లేత గోల్డెన్ రంగులోకి మారిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసి రెండు నిమిషాల పాటు వేయించండి.
మిరపకాయలు – ఇతర పదార్థాలు: ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు (సుమారు 1/8 టీ స్పూన్), మీ కారానికి తగినట్టు 10 నుండి 15 ఎండుమిరపకాయలను వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించుకోండి. ఎండుమిర్చి మంచి సువాసన వస్తున్నప్పుడు, పావు టీ స్పూన్ ఇంగువ, పావు టీ స్పూన్ పసుపును కలపండి.
కరివేపాకు వేయించడం: ఇప్పుడు ముందుగానే శుభ్రం చేసుకుని, నీళ్లు లేకుండా ఆరబెట్టుకున్న రెండు కప్పుల కరివేపాకును పాన్‌లో వేయండి. కరివేపాకును మరీ ఎక్కువసేపు వేయించకూడదు. కేవలం రెండు లేదా మూడు నిమిషాల పాటు తక్కువ మంట మీద వేయించి, స్టవ్ ఆపివేసి, ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ దశలో వేరుశనగ గుళ్ళు లేదా నువ్వులు కావాలంటే వేయించుకోవచ్చు, అయితే నిల్వ ఎక్కువగా ఉండాలంటే వాటిని చేర్చకుండా ఉండటమే మంచిది.
వెల్లుల్లిని సిద్ధం చేయడం: ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని, అందులోకి తొక్కలతో సహా పది వెల్లుల్లి రెబ్బలను వేసి, కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి.
చివరి పొడి తయారీ: పూర్తిగా చల్లారిన వేయించిన పదార్థాలన్నింటినీ అదే మిక్సీ జార్‌లోకి మార్చుకోండి. ఇందులోకి కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పును వేసి, మూత పెట్టి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోండి.
వెల్లుల్లి కలపడం: ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత, మనం పక్కన పెట్టుకున్న కచ్చాపచ్చా వెల్లుల్లిని ఈ పొడిలో వేసేయండి. వెల్లుల్లిని వేసిన తర్వాత, మిక్సీని ఒక్కసారి పల్స్ చేయండి (అంటే ఒకసారి ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేయండి). ఇలా చేయడం వల్ల వెల్లుల్లి ముక్కలు అక్కడక్కడా తగులుతూ కారం పొడికి మంచి రుచినిస్తాయి.
నిల్వ – వినియోగం:
ఇలా తయారుచేసుకున్న కరివేపాకు కారం పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఒక నెల రోజుల పైనే తాజాగా ఉంటుంది. ఇడ్లీలోకి, రైస్‌లోకి, ఉప్మాలోకి, దోసలోకి.. ఇలా ఎందులోకి తీసుకున్నా ఈ కారప్పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన, రుచికరమైన కరివేపాకు కారం పొడి రెసిపీని మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. మీ డైనింగ్ టేబుల్‌పై తప్పక ఉండాల్సిన ఈ పొడి ఎంతో రుచిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
