చలికాలంలో మార్నింగ్ వాకింగ్ చేయడం అంత ప్రమాదమా..? అసలు విషయం తెలిస్తే షాకే..

Morning Walk: మార్నింగ్ వాకింగ్ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని అందరూ నమ్ముతారు. కానీ చలికాలంలో మాత్రం ఇది రివర్స్ అవ్వొచ్చు. అవును చలికాలం ఉదయంపూట ఉండే విపరీతమైన చలి, పెరిగే కాలుష్యం మీ గుండెను, ఊపిరితిత్తులను ప్రమాదంలోకి నెట్టవచ్చు. దీనిపై డాక్టర్లు ఏమంటున్నారనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చలికాలంలో మార్నింగ్ వాకింగ్ చేయడం అంత ప్రమాదమా..? అసలు విషయం తెలిస్తే షాకే..
Morning Walking Health Risks

Updated on: Jan 09, 2026 | 6:15 AM

చలికాలంలో తెల్లవారుజామునే లేచి వాకింగ్‌కు వెళ్లడం ఒక మధురమైన అనుభవం. శరీరాన్ని ఉత్సాహంగా ఉంచేందుకు చాలామంది ఈ అలవాటును కొనసాగిస్తారు. అయితే చలికాలపు చలిలో దాగి ఉన్న ప్రమాదాలు మీ ఆరోగ్య ప్రయోజనాల కంటే ఎక్కువ హాని కలిగించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, బీపీ ఉన్నవారు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

రక్త నాళాలపై చలి ప్రభావం

ఆరెడ్ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ సందీప్ రెడ్డి కొప్పుల ప్రకారం.. విపరీతమైన చలి కారణంగా మన శరీరంలోని రక్త నాళాలు కుంచించుకుపోతాయి. రక్త ప్రసరణ నెమ్మదించి, గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇప్పటికే గుండె జబ్బులు, మధుమేహం ఉన్నవారికి ఇది చాలా హానికరం. తెల్లవారుజామున ఉండే విపరీతమైన చలి వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది.

సైలెంట్ కిల్లర్.. వాయు కాలుష్యం

చాలామంది స్వచ్ఛమైన గాలి కోసం ఉదయాన్నే బయటకు వెళ్తారు. కానీ చలికాలంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. చల్లటి గాలి బరువుగా ఉండటం వల్ల కాలుష్య కారకాలు, ధూళి కణాలు భూమికి దగ్గరగా స్థిరపడతాయి. ఉదయాన్నే నడిచేవారు పగటిపూట కంటే ఎక్కువ హానికరమైన విషపూరిత కణాలను పీల్చుకుంటారు. ఇది ఊపిరితిత్తులను చికాకు పెట్టడమే కాకుండా ఆస్తమా ఉన్నవారి పరిస్థితిని విషమింపజేస్తుంది. పిల్లలు, వృద్ధులలో ఛాతీ ఇన్ఫెక్షన్లకు ఇది ప్రధాన కారణం అవుతోంది.

ముందు జాగ్రత్తలు: ఎలా చురుగ్గా ఉండాలి?

శరీరానికి వ్యాయామం అవసరమే, కానీ అది ప్రాణాల మీదకు రాకూడదు. అందుకే వైద్యులు ఈ క్రింది సూచనలు చేస్తున్నారు.

సమయం మార్చుకోండి: తెల్లవారుజామున కాకుండా కాస్త ఎండ వచ్చిన తర్వాత లేదా సాయంత్రం వేళల్లో నడకకు వెళ్లడం సురక్షితం.

ఇండోర్ వ్యాయామాలు: బయట విపరీతమైన చలి లేదా కాలుష్యం ఉన్నప్పుడు ఇంటి లోపల యోగా, స్ట్రెచింగ్ లేదా ట్రెడ్‌మిల్ వంటి వ్యాయామాలు చేయడం మేలు.

సరైన దుస్తులు: ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే శరీరాన్ని పూర్తిగా కప్పేలా వెచ్చని దుస్తులు ధరించాలి.

వ్యాయామం ఆరోగ్యానికి పెట్టని కోట. కానీ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. శీతాకాలంలో వేళకాని వేళ నడక కంటే, సురక్షితమైన సమయంలో వ్యాయామం చేయడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.