
ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు. స్త్రీ కుటుంబానికి కళ్ళు, ఇంటికి దీపం ఇల్లాలు.. ఒకప్పుడు నాలుగు గోడలకే పరిమితమైన మహిళలు నేడు అన్వేషించని రంగం లేదు. మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు. తాను ఎంచుకున్న రంగంలో తమదైన ముద్ర వేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. తాము ఎవరికీ తీసిపోనని నిరూపించుకుంటున్నారు. వివిధ రంగాలలోని మహిళలు సాధించిన విజయాలను గుర్తించడానికి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రారంభమైంది. ఈ దినోత్సవ వేడుకలు ఉత్తర అమెరికా, యూరప్‌లోని కార్మిక ఉద్యమాల నుంచి ఉద్భవించాయి. మొదటి జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్‌లో ఫిబ్రవరి 28వ తేదీ, 1909 జరుపుకున్నారు. 1908లో న్యూయార్క్‌లో జరిగిన వస్త్ర కార్మికుల సమ్మె జ్ఞాపకార్థం సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
న్యూయార్క్‌లో సోషలిస్ట్ మహిళలు, వస్త్ర కార్మికులు తక్కువ పని గంటలు, అధిక వేతనాలు, ఓటు హక్కును డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అలా మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అవును యూరోపియన్ కార్యకర్తలు మహిళలకు ప్రత్యేక రోజును కేటాయించాలని ప్రచారం ప్రారంభించారు. తమ ఓటు హక్కును డిమాండ్ చేశారు. అంతేకాదు సమాన వేతనం, పని హక్కుల కోసం నాయకత్వం వహించారు. ఈసారి ఈ ర్యాలీలలో పది లక్షల మందికి పైగా పాల్గొన్నారు. తరువాత 1910లో కోపెన్‌హాగన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సమావేశంలో క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. ఆ ఆలోచన ఆమోదించబడింది.
ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా 1911లో అనేక యూరోపియన్ దేశాలలో జరుపుకున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి అధికారికంగా 1975 లో మహిళా దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది. రెండు సంవత్సరాల తరువాత 1977లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సభ్య దేశాలను మార్చి 8ని మహిళా హక్కులు, ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా ప్రకటించమని ఆహ్వానించింది. ఆ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రత్యేక మహిళా దినోత్సవాన్ని అప్పటి నుంచి మార్చి 8వ తేదీన జరుపుకోవడం మొదలు పెట్టారు.
ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఒక థీమ్‌తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇతి వృత్తం క్రియాశీలత. ఈ సంవత్సరం థీమ్ మహిళలు, బాలికల హక్కులు, సమానత్వం, సాధికారతపై ఆధారపడి ఉంటుంది. అంతే కాదు ఇది మహిళల జీవితాలను మెరుగుపరచడానికి, వేగవంతమైన పురోగతికి పిలుపునిస్తుంది. ఇది మహిళలకు సాధికారత కల్పించడానికి, సమాన అవకాశాలను అందించడానికి.. వివక్షను తొలగించడానికి చర్యలు తీసుకోవడానికి ప్రజలను, ప్రభుత్వాలను, సంస్థలను ప్రేరేపిస్తుంది. అంతేకాదు ఈ ఏడాది థీమ మహిళల సామాజిక, ఆర్థిక , రాజకీయ విజయాలను గుర్తించడం గురించి. అలాగే మహిళల హక్కులు, సమానత్వం గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం.. కనుక ఈ రోజు ప్రపంచంలోని మహిళలకు అత్యంత ముఖ్యమైనది. అందువల్ల మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వంతో సహా వివిధ సంస్థలు అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..