AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కింద కూర్చుని తింటున్నారా..? అయితే ఇది మస్ట్‌గా తెలుసుకోవాల్సిందే..

మనం తీసుకునే ఆహారం ఎంత బలమైనదో, దానిని ఎలా కూర్చుని తింటున్నామనేది కూడా అంతే ముఖ్యం. మన జీవనశైలిలో కూర్చునే విధానం, సమయం నేరుగా జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. చాలామంది భోజనం చేసేటప్పుడు వంగి కూర్చుంటారు, దీనివల్ల పొత్తికడుపులోని అవయవాలపై ఒత్తిడి పడి జీర్ణక్రియ మందగిస్తుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.

కింద కూర్చుని తింటున్నారా..? అయితే ఇది మస్ట్‌గా తెలుసుకోవాల్సిందే..
Impact Of Sitting Posture On Digestion And Knee Health.jpg
Nikhil
|

Updated on: Apr 22, 2026 | 6:48 PM

Share

పూర్వీకుల కాలం నుండి నేలపై కూర్చుని తినడం ఒక ఆచారంగా వస్తోంది. అయితే, మారుతున్న కాలంతో పాటు మన శరీర తత్వాలను బట్టి ఈ అలవాటు అందరికీ శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ పోసేశ్వర రావు వెల్లడించిన ప్రకారం, నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల కలిగే లాభనష్టాలు వయస్సుపై ఆధారపడి ఉంటాయి. నిటారుగా కూర్చోవడం వల్ల శరీరంలోని రక్తప్రసరణ సాఫీగా సాగి, భోజనం తర్వాత వచ్చే నీరసం లేదా మగత వంటివి దరిచేరవు. భంగిమ సరిగ్గా లేకపోతే కేవలం అజీర్ణమే కాకుండా వెన్నుముక, మెడ నొప్పులు కూడా వేధిస్తాయి.

వయస్సును బట్టి ఫలితాలు..

నేలపై కూర్చుని తినడం పిల్లలకు, యుక్త వయస్సులో ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. వారి కీళ్లు, కండరాలు దృఢంగా ఉండటం వల్ల నేలపై కూర్చోవడం వారికి వ్యాయామంలా పనిచేస్తుంది. కానీ వయసు పైబడిన వారు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు మాత్రం ఈ అలవాటుకు దూరంగా ఉండాలి. వయసు పెరిగే కొద్దీ కీళ్లలోని కందెన తగ్గి, అవి బలహీనపడతాయి. నేలపై కూర్చొని భోజనం ముగిశాక పైకి లేచే సమయంలో శరీర బరువు మొత్తం మోకాళ్లపై పడుతుంది. ఈ క్రమంలో సాధారణం కంటే సుమారు 7 శాతం అదనపు ఒత్తిడి మోకాళ్లపై పడుతుందని, ఇది కీళ్ల నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

మోకాళ్ల అరుగుదల..

నేలపై నుండి లేచేటప్పుడు కలిగే ఒత్తిడి వల్ల మోకాళ్లలోని మృదులాస్థి త్వరగా అరిగిపోయే అవకాశం ఉంది. ఈ అరుగుదల ఒక్కసారి మొదలైతే తిరిగి సాధారణ స్థితికి రావడం చాలా కష్టం. ఈ అలవాటును నిరంతరం కొనసాగిస్తే నొప్పులు తీవ్రమై, చివరికి మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స వరకు దారితీయవచ్చు. అందుకే వెన్నుముకకు మంచిదని భావించి మోకాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదు.

మోకాళ్ల సమస్యలు ఉన్నవారు లేదా వృద్ధులు డైనింగ్ టేబుల్ లేదా కుర్చీని ఉపయోగించడం ఉత్తమమైన మార్గం. మీ శరీర స్థితిని బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మన ఆరోగ్య సూత్రాలు అనేవి మన వయస్సు, శరీర సామర్థ్యానికి అనుగుణంగా ఉండాలి. పాత అలవాట్లు మంచివే అయినప్పటికీ, నేటి కాలంలో మన శారీరక స్థితికి ఏది సరిపోతుందో గమనించి మసలుకోవడం విజ్ఞత అనిపించుకుంటుంది.

Follow Us